'నీ కోసం' సినిమాలో ఛాన్స్ అలా వచ్చింది: ఆర్పీ పట్నాయక్

26-12-2017 Tue 16:54
  • 'నీ కోసం' నాకు ఫస్టు మూవీ 
  • సోలో హీరోగా రవితేజకి ఛాన్స్ 
  • శ్రీను వైట్లకి తొలి సినిమా  
" 'నీ కోసం'తో సంగీత దర్శకుడిగా మీకు మొదటిసారిగా అవకాశం వచ్చింది. ఈ సినిమాతోనే సోలో హీరోగా రవితేజకు అవకాశం వచ్చింది. ఇక దర్శకుడిగా శ్రీను వైట్లకి తొలి సినిమా. ఈ సినిమాలో మీకు అవకాశం రావడానికి ఎంతలా కష్టపడ్డారు?" అని అలీ ప్రశ్నించడంతో .. " నిజం చెప్పాలంటే నేను ఈ సినిమాలో అవకాశం కోసం కష్టపడలేదు .. అనుకోకుండానే ఆ ఛాన్స్ వచ్చింది" అని ఆర్పీ అన్నారు.

 "చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలై ఆగిపోయింది. అప్పటికి ఆ సినిమా పాటల రికార్డింగ్ పూర్తయిపోయింది. అదే సమయంలో 'నీ కోసం' సినిమా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో వుంది. అప్పటికే దేవిశ్రీ ప్రసాద్ 'కొంటె బాపు' అనే ఒక పాట చేసేశారు. ఇక  నిర్మాతలు మిగతా పాటలను చెన్నై వెళ్లి చేయించుకునే పరిస్థితి లేదు. అప్పుడు చంద్ర సిద్ధార్థ్ తన సినిమా కోసం నేను చేసిన పాటలను వాళ్లకు వినిపించారు. అందులో నుంచి వాళ్లు రెండు పాటలు తీసుకుని .. అవి బాగున్నాయని చెప్పేసి మిగతా పాటలను నాతోనే చేయించారు. అలా నాకు అవకాశం వచ్చింది" అని చెప్పుకొచ్చారు.