Terrorist: జర భద్రం! న్యూ ఇయర్ వేడుకలపై ఉగ్రవాదుల గురి!

  • కొత్త సంవత్సర వేడుకలపై ఉగ్రవాదుల కన్ను
  • అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు ఆదేశాలు
  • విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం

న్యూ ఇయర్ వేడుకలపై ఉగ్రవాదుల కన్ను పడింది. కొత్త సంవత్సర వేడుకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ఉగ్రవాదులు పథక రచన చేస్తున్నట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం నుంచి అన్ని రాష్ట్రాల పోలీస్ బాస్‌లకు సమాచారం అందింది.  దీంతో అప్రమత్తమైన  పోలీసులు విమానాశ్రయాలు, ఇతర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. విమానాశ్రయాల్లో భద్రతను పెంచాలంటూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) అప్రమత్తం చేసింది.

కొత్త సంవత్సర వేడుకలతోపాటు పండుగ సీజన్ సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఈ మేరకు సమాచారం అందిందని బీసీఏఎస్ చీఫ్ రాజేశ్ కుమార్ చంద్ర తెలిపారు. జనసమ్మర్థ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

విమానాశ్రయాల్లో, ముఖ్యంగా టెర్మినల్ బిల్డింగ్ లోపల అప్రమత్తంగా ఉండాలని, లోపలికి ప్రవేశించే వారిపై ఓ కన్ను వేయాలని బీసీఏఎస్ సూచించింది. కారు పార్కింగ్ ప్రదేశాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని, కారు బాంబులతో దాడికి దిగే అవకాశం ఉండడంతో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పేర్కొంది. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కోరింది.

More Telugu News