cyberabad: ఆ వీడియో తీసింది హారికనే!: షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి

  • అడిషినల్ డీసీపీ గంగిరెడ్డి నన్ను కొడుతుండగా వీడియో తీసింది
  • ఆ వీడియోను హారిక తన ఫ్రెండ్స్ కు షేర్ చేసింది
  • మీడియాతో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి

షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి కొట్టిన వీడియో బయటకు రావడం, ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం తెలిసిందే. అయితే, యోగిని డీసీపీ కొడుతుండగా వీడియో ఎవరు తీశారనే విషయం ఆసక్తిదాయకంగా మారింది. ఈ తరుణంలో యోగి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, షార్ట్ ఫిల్మ్ లో నటించే అవకాశం కల్పిస్తానని హారికకు తానెప్పుడూ చెప్పలేదని డైరెక్టర్ యోగి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆమె దగ్గర తీసుకున్న పదివేల రూపాయలు తిరిగి ఇవ్వనందుకే హారిక తనపై కేసు పెట్టిందని ఆరోపించారు.

హారిక తనకు రెండేళ్లుగా పరిచయమని, తమ మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయని చెప్పారు. దీంతో, ఆమె వద్ద గతంలో తీసుకున్న పదివేల రూపాయలు తిరిగి ఇవ్వమని అడిగిందని, ఈ విషయమై లేనిపోని రాద్ధాంతం చేయవద్దని ఆమెతో చెప్పానని అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని చూసిన హారిక అడిషినల్ డీసీపీ గంగిరెడ్డికి ఫిర్యాదు చేసిందని, ఈ విషయమై మాట్లాడేందుకు అడిషినల్ డీసీపీ తనను పిలిపించడంతో వెళ్లానని చెప్పారు. ‘పది వేల రూపాయల కోసం నన్ను పిలిపించి మాట్లాడటం ఏంటి?’అని ప్రశ్నించినందుకు గంగిరెడ్డి తనను కొట్టారని, ఆ సందర్భంలోనే హారిక వీడియో తీసిందని, ఈ వీడియోను తన ఫ్రెండ్స్ కు హారిక షేర్ చేసిందని ఆయన ఆరోపించారు.

హారికకు, తనకు రెండేళ్లుగా పరిచయమున్నప్పటికీ, పదిరోజుల క్రితమే ఆమె తనను కలిసినట్టు చెబుతోందని, అదంతా అబద్ధమని ఆరోపించారు. హారికతో పోలీసులు ఇలా చెప్పిస్తున్నారేమోనని యోగి అనుమానం వ్యక్తం చేశారు. హారిక, తాను క్లోజ్ ఫ్రెండ్స్ మని, తమ మధ్య షార్ట్ ఫిల్మ్ కు గురించిన చర్చ ఎప్పుడూ రాలేదని చెప్పారు. షార్ట్ ఫిల్మ్ లో నటించే అవకాశం ఇవ్వమని మాత్రం ఆమె తనను అడిగేదని, అయితే, ఏ షార్ట్ ఫిల్మ్ కు ఆమె కమిట్ కాలేదని పేర్కొన్నారు.

More Telugu News