jc prabhakar reddy: ఎమ్మెల్యే జేసీ ఆగడాలపై చంద్రబాబు స్పందించరే?: సీపీఐ నేత రామకృష్ణ

  • పోలీసులపై దుర్భాషలాడిన ప్రభాకర్ రెడ్డి తీరుపై మండిపడ్డ నేత
  • ‘అనంత’లో సామాన్యులకే కాకుండా పోలీసులకూ రక్షణ లేదు
  • పోలీసులకు కూడా గన్ మెన్లను నియమించాల్సిన పరిస్థితి

తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు స్పందించరంటూ సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడి పోలీసులపై దుర్భాషలాడిన ప్రభాకర్ రెడ్డి తీరుపై చంద్రబాబు స్పందించకపోవడం సబబు కాదని అన్నారు. అనంతపురం జిల్లాలో సామాన్యులకే కాకుండా పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని, ప్రజా ప్రతినిధులతో పాటు పోలీసులకు కూడా గన్ మెన్లను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యంగ్యంగా అన్నారు.

కాగా, ఎంపీ జేసీపై అనంతపురం మేయర్ స్వరూప తీవ్ర విమర్శలు చేయడం విదితమే. దీంతో, జేసీ అనుచరుడు ఒకరు స్వరూపకు, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కి ఫోన్ చేసి దుర్భాషలాడారు. ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు జేసీ అనుచరుడిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అక్కడికి వెళ్లి పోలీసులపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 

More Telugu News