Madhya Pradesh: ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి?: 'ఐడియాలు చెప్పండి.. రూ. 10 లక్షలు గెలుచుకోండి' అంటున్న సర్కార్!

  • ప్రజలను ఆనందంగా ఉంచాలంటున్న మధ్యప్రదేశ్
  • 'ఆనందం' శాఖను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్ర ప్రభుత్వం
  • ఉపాయాలు చెబితే భారీ బహుమతులు

ప్రజలను ఆనందంగా ఉంచేందుకు ఏం చేయాలన్న విషయాన్ని చెప్పిన వారికి రూ. 10 లక్షలను ఇస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ఆఫర్ ఇచ్చింది. మొట్టమొదటి సారిగా 'ఆనందం శాఖ' (హ్యాపీనెస్ డిపార్ట్ మెంట్)ను ఏర్పాటు చేసిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన మధ్యప్రదేశ్, ప్రజలను సంతోష పెట్టే ఉపాయాలు చెబితే, భారీ బహుమతులు ఇస్తామని పేర్కొంది. ఇందుకోసం అధికారులు, విద్యా నిపుణులను ఆహ్వానించడమే కాకుండా, వారు పరిశోధనలు, అధ్యయనం సాగించేందుకు నిధులను కూడా కేటాయించింది.

ఈ మేరకు ప్రముఖ విద్యా సంస్థల ప్రధానాచార్యులకు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రతిపాదనలు స్పష్టంగా ఉండాలని, సంతోషం ఆవశ్యకతను ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పడంతో పాటు, రాష్ట్రంలో ఆనందాన్ని వ్యాప్తి చేయాలని, ఎవరైనా తమకు ఐడియా చెప్పవచ్చని రాజ్య ఆనంద సంస్థాన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ గంగెడే చెప్పారు. అయితే, ఫలితాలు వచ్చిన తరువాతనే నగదు మంజూరవుతుందని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News