chidambaram: నా బ్యాంక్ ఖాతాను ఇంకా ఆధార్‌తో అనుసంధానం చేయ‌లేదు: మాజీ ఆర్థిక‌మంత్రి

  • అన్నింటికి ఆధార్ అనుసంధానాన్ని ఖండించిన చిదంబ‌రం
  • వ్య‌తిరేకించిన ఇన్ఫోసిన్ చైర్మ‌న్ నారాయ‌ణ‌మూర్తి
  • ఐఐటీ ముంబైలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చిదంబరం, నారాయ‌ణమూర్తి

త‌న బ్యాంక్ ఖాతాను ఇంకా ఆధార్‌తో అనుసంధానం చేయ‌లేద‌ని మాజీ ఆర్థిక‌మంత్రి చిదంబ‌రం వెల్ల‌డించారు. జ‌న‌వ‌రి 17న ఐదుగురు స‌భ్యుల సుప్రీం ధ‌ర్మాస‌నం తీర్పు ఇచ్చే వ‌ర‌కు ఎవ‌రూ త‌మ ఆధార్ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌వ‌ద్ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఐఐటీ ముంబైలో జ‌రిగిన 'మూడ్ ఇండిగో ఫెస్టివ‌ల్‌'కు ఆయ‌న హాజ‌ర‌య్యారు. 'వివిధ సేవలకు ఆధార్ అనుసంధానం' అంటూ మోదీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ కార్యక్రమాన్ని ఆయ‌న తీవ్రంగా విమ‌ర్శించారు. వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మేంట‌ని చిదంబ‌రం ప్ర‌శ్నించారు. ఒకవేళ తాను ప్రభుత్వంలో ఉంటే, వ్యక్తిగత విషయాలను వెల్లడించేందుకు నిరాకరిస్తానని అన్నారు.

అయితే అదే కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఇన్ఫోసిస్ చైర్మ‌న్ నారాయ‌ణ‌మూర్తి, చిదంబ‌రం చేసిన వ్యాఖ్య‌ల‌ను వ్యతిరేకించారు. మాజీ మంత్రి చిదంబరం మాట్లాడిన అంశాలన్నీ ఈ రోజుల్లో గూగుల్‌లోనే దొరుకుతున్నాయని అన్నారు. అయితే వ్యక్తిగత విషయాలను భద్రపరచడం ప్రభుత్వ కర్త్యవమని, ఆ వివ‌రాలు హ్యాక‌ర్ల చేతిలో ప‌డ‌కుండా ఉండేందుకు పార్లమెంట్ చట్టం చేయాలని నారాయణ మూర్తి సూచించారు. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను రక్షించే చట్టాలు ఉన్నంత వరకు ఎవరికీ ఎటువంటి సమస్య ఉండదని నారాయణమూర్తి తెలిపారు.

More Telugu News