సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

23-12-2017 Sat 07:31
  • న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా డ్యాన్సులు 
  • తమ్ముడి ఫంక్షన్ కు అల్లు అర్జున్
  • మరో చిత్రంలో అల్లరి నరేష్
  • 'దండుపాళ్యం' దర్శకుడితో శర్వానంద్

*  నూతన సంవత్సర వేడుకలు వస్తున్నాయంటే అందాల తారలు బిజీ అయిపోతారు. డిసెంబర్ 31 రాత్రి వేడుకల్లో డ్యాన్సులు చేయడానికి పెద్ద మొత్తంలో తీసుకుంటూ తమ ఇమేజ్ ని క్యాష్ చేసుకుంటారు. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కూడా ఈ 31 రాత్రి ఓ వేడుకలో పాల్గొంటోంది. గుంటూర్ సమీపంలోని హాయ్ ల్యాండ్ రిసార్ట్స్ లో నిర్వహించే భారీ వేడుకల్లో డ్యాన్స్ చేయడానికి అమ్మడు ఒప్పందం చేసుకుందట. ఆమెతో పాటుగా మెహ్రీన్, కైరా దత్ తదితర అందాల భామలు కూడా ఆ రోజు అక్కడ డ్యాన్సులు చేస్తారట.
*  అల్లు శిరీష్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన 'ఒక్క క్షణం' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల 25న హైదరాబాదులో నిర్వహిస్తారు. ముఖ్య అతిథిగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేస్తాడని సమాచారం.
*  కామెడీ స్టార్ అల్లరి నరేష్ తాజాగా ఓ చిత్రానికి ఓకే చెప్పాడు. గతంలో 'నందిని నర్సింగ్ హోం' చిత్రాన్ని రూపొందించిన గిరి దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఇది కాకుండా నరేష్ ఇప్పటికే భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు.
*  ప్రస్తుతం హను రాఘవపూడితో ఓ చిత్రం, సుధీర్ వర్మతో మరో చిత్రం చేస్తున్న యంగ్ హీరో శర్వానంద్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 'దండుపాళ్యం' ఫేం శ్రీనివాసరాజు దర్శకత్వంలో నటించడానికి శర్వా ఓకే చెప్పాడు.