శ్రీలంకపై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం!

23-12-2017 Sat 07:30
  • రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ
  • టీ20ల్లో ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్
  • రోహిత్-లోకేష్ ల భాగస్వామ్యం 165 పరుగులు

ఇండోర్ లో నిన్న శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి 10 సిక్సర్లు, 12 ఫోర్లతో 43 బంతుల్లోనే 118 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు చాహల్ (4 వికెట్లు), కుల్దీప్ (3)లు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో శ్రీలంక 17.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 88 పరుగులతో ఘన విజయం సాధించడమే కాక, ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది.  చివరి టీ20 24న ముంబైలో జరగనుంది.

ఈ మ్యాచ్ సందర్భంగా పలు రికార్డులు బద్దలయ్యాయి.

  • టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతులు)తో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ రికార్డును సమం చేసిన రోహిత్.
  • భారత్ తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రోహిత్ అవతరించాడు. గతంలో ఈ రికార్డు లోకేష్ రాహుల్ (110) పేరిట ఉంది.
  • టీ20ల్లో రెండు సెంచరీలు చేసిన ఐదో క్రికెటర్ రోహిత్
  • టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (10) బాదిన భారత ఆటగాడిగా అవతరించిన రోహిత్. గతంలో యువీ 7 సిక్సర్లు బాదాడు.
  • 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్-లోకేష్. టీ20ల్లో ఏ జోడీకైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.