జ‌న‌వ‌రి 1న ఏపీలోని దేవాల‌యాల్లో పూజ‌ల‌కు నో ప‌ర్మిష‌న్‌: ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

22-12-2017 Fri 21:15
  • అది మ‌న సంప్ర‌దాయం కాదు: ఏపీ దేవాదాయ‌శాఖ‌
  • భారతీయ వైదిక విధానం కాదు
  • దేవాల‌యాల‌ను ప్ర‌త్యేకంగా అలంకరించటం వంటివి చేయ‌కూడ‌దు

జనవరి ఒకటిన నూత‌న సంవ‌త్స‌రం ప్రారంభం రోజున భార‌త్‌లో ప్ర‌జ‌లు చాలా మంది గుడికి వెళ్లి ఆ సంవ‌త్స‌రం అంతా బాగుండాల‌ని మొక్కుకుంటారు. అయితే, భారతీయ సంప్రదాయం కాని జ‌న‌వ‌రి 1న జరుగుతున్న ఇటువంటి తంతును అరికట్టడానికి ఏపీ దేవాదాయ శాఖ నడుం బిగించింది. ఈ విష‌యంపై దీర్ఘంగా చ‌ర్చించిన దేవాదాయశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల్లో జనవరి 1న ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేపట్టవద్దని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టుకు ఆదేశాలు జారీ చేసింది. జ‌వ‌న‌రి 1న ఇలా వేడుక‌లు జ‌ర‌పుకోవ‌డం భారతీయ వైదిక విధానం కాదని అందులో పేర్కొన‌డం విశేషం. దేవాల‌యాల‌ను ప్ర‌త్యేకంగా అలంకరించటం వంటివి చేయ‌కూడ‌ద‌ని తెలిపింది. ఏపీలోని అన్ని ఆలయాలకు ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్నామ‌ని చెప్పింది.