Harish Rao: అద్దె గోడౌన్లను.. ప్రయివేటు గోడౌన్లను వెంట‌నే ఖాళీ చేయించండి: అధికారులకు హ‌రీశ్‌రావు ఆదేశాలు

  • గిడ్డంగులపై అధికారుల‌తో మంత్రి హ‌రీశ్‌రావు సమీక్ష
  • గిడ్డంగుల కార్యకలాపాలలో తెలంగాణ ఫస్ట్, గుజరాత్ లాస్ట్
  • గిడ్డంగుల విష‌యంపై ముగ్గురు సభ్యులతో కమిటీ
  • ఐదు రోజుల్లో నివేదిక.. 15 రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్

రైతుల పంట దిగుబడులకు సరిపడిన ప్రభుత్వ గోడౌన్లు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ప్రయివేటు, అద్దె గోడౌన్లను ప్రోత్సహించడం తగదని మంత్రి హరీశ్ రావు అన్నారు. వెంటనే మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఐదు రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఆయా అద్దె గోడౌన్ లను ఖాళీ చేయించి నిల్వలు ప్రభుత్వ గోడౌన్లకు తరలించాలని ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తో మంత్రి ఫోన్ లో మాట్లాడారు.

ఇకపై నెలవారీ గిడ్డంగుల కార్యక్రమాల నివేదికలు ఇవ్వాలని కోరారు. మరో 15 రోజులలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని హరీశ్ రావు తెలిపారు. గిడ్డంగుల కార్యకలాపాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ రోజు గిడ్డంగుల సంస్థ ప్రగతిని మంత్రి సమీక్షించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రథ‌మ స్థానంలో ఉందని ఆయన అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర కార్యక్రమాలలోనూ నెంబర్ వన్ స్థానంలో ఉండడం గర్వకారణం అని హరీశ్ రావు చెప్పారు.

రాష్ట్రంలో గిడ్డంగులను 97 శాతం ఉపయోగించుకోవడంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ద్వితీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, చివరి స్థానంలో గుజరాత్ నిలిచిందని తెలిపారు. గడచిన మూడున్నర సంవత్సరాలలోనే తెలంగాణ చాలా పురోగతి సాధించిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులో ఉన్న మట్టిని పంట పొలాల్లో పోయడం ద్వారా పంట దిగుబడి అధికంగా పెరిగిందన్నారు. 24 గంటలు నాణ్యమైన కరెంట్ ను జనవరి 1 నుంచి ఇవ్వనున్నట్టు చెప్పారు. పంట దిగుబడుల అంచనాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ 18 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాంలు నిర్మిస్తున్న విషయాన్ని మంత్రి తెలిపారు.

More Telugu News