ileana: మంచి కంటెంట్ ఉంటే బుల్లితెరపైనా అలరించడానికి రెడీ: ఇలియానా

  • ఇలియానా ‘ముబారకన్‌’, ‘బాద్‌షాహో’ సినిమాలు విజ‌య‌వంతం
  • త్వ‌ర‌లోనే టీవీలో ‘ముబారకన్‌’ సినిమా
  • సినిమా హాల్స్‌లో సినిమా చూడటం, ఇంట్లో టీవీ చూడటం వేర్వేరు విష‌యాలు

తాను నటించిన సినిమాల‌న్నీ మంచి కంటెంట్‌ ఉన్నవేన‌ని, మంచి కంటెంట్ ఉంటే బుల్లి తెరపైనా అలరించడానికి తాను రెడీ అని అంటోంది హీరోయిన్ ఇలియానా. దేవ‌దాసు సినిమాతో సినీ ప‌రిశ్ర‌మలోకి ఎంట్రీ ఇచ్చి పోకిరీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఇలియానా ఆ త‌రువాత కూడా తెలుగులో ప‌లు హిట్ సినిమాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం ఈ భామ బాలీవుడ్ సినిమాల్లోనే క‌న‌ప‌డుతోంది. ఆమె నటించిన ‘ముబారకన్‌’, ‘బాద్‌షాహో’ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ఆమె నటించిన ‘ముబారకన్‌’ సినిమా త్వ‌ర‌లోనే టీవీలో రాబోతుంది.

ఈ నేప‌థ్యంలో ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... కంటెంట్‌ ఉంటే బుల్లితెరపైనా సందడి చేస్తానని, ఇలాంటి ఛాలెంజ్‌తో కూడుకున్న అవకాశం వచ్చినప్పుడు వ‌దులుకోబోన‌ని చెప్పింది. బుల్లితెర ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అవ్వచ్చో అవ్వ‌లేమో త‌న‌కు స‌రిగా తెలీదని, అయితే, సినిమా హాల్స్‌లో సినిమా చూడటం, ఇంట్లో టీవీ చూడటం వేరని తెలిపింది. 'అయితే, ఇక్కడో విషయం చెప్పుకోవాలి. టీవీలో ఒక సినిమా మళ్లీ మళ్లీ వస్తుంది కాబట్టి, పదే పదే చూడచ్చు, ఇక నా సినిమా తొలిసారి టీవీలో ప్రసారం అవుతున్నందుకు సంతోషంగా ఉంది' అని తెలిపింది.

More Telugu News