టీడీపీ డ్రామాలాడుతోంది.. మిత్రపక్షాలను వెన్నుపోటు పొడిచే చరిత్ర ఆ పార్టీది: బీజేపీ నేత సురేష్ రెడ్డి

20-12-2017 Wed 13:12
  • మిత్ర ధర్మానికి తూట్లు పొడుస్తోంది
  • బీజేపీ కార్యకర్తలకు రుణాలు కూడా అందడం లేదు
  • అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు
తెలుగుదేశం పార్టీపై ఏపీ బీజేపీ నేతల విమర్శలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిన్న టీడీపీపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. నేడు ఏపీ బీజేపీ నేత సురేష్ రెడ్డి టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ డ్రామాలు ఆడుతోందని... మిత్రధర్మానికి తూట్లు పొడిచింది ఆ పార్టీనే అని ఆయన మండిపడ్డారు.

మిత్రపక్షాలకు వెన్నుపోటు పొడిచే చరిత్ర టీడీపీది అని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలను టీడీపీ నేతలు చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. జన్మభూమి కమిటీల్లో కూడా బీజేపీ కార్యకర్తలకు స్థానం కల్పించలేదని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు, రుణాలు అన్నీ టీడీపీ కార్యకర్తలకే వెళుతున్నాయని అన్నారు. అవినీతిపై ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.