Delhi: బ్యాంకుకు రంధ్రం చేసి.. కోటి రూపాయలకు పైగా ఎత్తుకెళ్లిన దొంగలు.. దేశ రాజధానిలో సంచలనం!

  • దోపిడీకి ముందే వస్తువుల కొనుగోలు
  • సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్ ధ్వంసం
  • 15 లాకర్లు బద్దలుగొట్టి నగలు, నగదు చోరీ
  • బ్యాంకు సిబ్బంది పాత్రపై అనుమానం

ఢిల్లీలో అతిపెద్ద దోపిడీ జరిగింది. ఓ బ్యాంకుకు రంధ్రం చేసిన దొంగలు.. కోటికిపైగా విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఔటర్ ఢిల్లీలోని ముంద్కాలో ఈ ఘటన చేసుకుంది. దొంగలు మొత్తం 15 లాకర్లు బద్దలుగొట్టినట్టు పోలీసులు తెలిపారు.

బ్యాంకు పక్కనే ఉన్న ప్లాటు నుంచి ఎలక్ట్రానిక్ కట్టర్లు, 8 గ్యాస్ సిలిండర్లు ఉపయోగించి దొంగలు బ్యాంకులోకి రంధ్రం చేశారు. లోపలికి చొరబడ్డాక  సీసీ టీవీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డులను ధ్వంసం చేశారు. అనంతరం లాకర్లను తెరిచి అందులోని నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

శనివారం, లేదంటే ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సొత్తుతో ఉడాయించిన దొంగలు గ్యాస్ సిలిండర్లు, రంధ్రం చేసేందుకు ఉపయోగించిన వస్తువులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.  వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి కొత్తగా ఉన్నాయని, దోపిడీ కోసమే వాటిని కొనుగోలు చేసినట్టు చెప్పారు.

బ్యాంకుకు రంధ్రం చేయడానికి రెండు మూడు గంటలు పట్టి ఉంటుందని, అయితే బ్యాంకు రద్దీ రోడ్డు పక్కగా ఉండడంతో రంధ్రం చేస్తున్న చప్పుడు వాహనాల శబ్దాల్లో కలిసిపోయి వినిపించి ఉండకపోవచ్చని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో బ్యాంకు సిబ్బంది హస్తం ఉండొచ్చన్న అనుమానంతో వారిని కూడా విచారిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని పేర్కొన్నారు.

More Telugu News