Narendra Modi: గుజరాత్‌లో బీజేపీ గెలుపునకు కారణం అదేనా?

  • గుజరాత్‌లో కనిపించని ప్రజా వ్యతిరేకత
  • పటీదార్లతో కలిసినా కాంగ్రెస్ పరాజయం
  • బుల్లెట్ రైలే బీజేపీకి ఓట్లు తెచ్చిందంటున్న విశ్లేషకులు
  • మణిశంకర్ అయ్యర ‘నీచ్’ వ్యాఖ్యలు ఇంకో కారణం

సాధారణంగా ఏ ప్రభుత్వం పైన అయినా ఐదేళ్ల తర్వాత కొంత ప్రజా వ్యతిరేకత ఉంటుంది. అయితే గుజరాత్‌లో మాత్రం అటువంటిది ఏదీ లేదని తాజాగా వెల్లడైన ఫలితాల ద్వారా వెల్లడైంది. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఆరోసారి విజయ కేతనం ఎగురవేసి ప్రజా విశ్వాసం తమకే సొంతమని నిరూపించింది.

నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీపై ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వచ్చాయి. దీనికి తోడు కాంగ్రెస్ కూడా కొంత పుంజుకున్నట్టు కనిపించింది. పటీదార్ల మద్దతుతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని భావించారు. అయితే ఆ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి.

మరి, గుజరాత్‌లో బీజేపీ విజయానికి కారణం ఏంటి? అంటే.. రాజకీయ విశ్లేషకులు రెండు విషయాలు చెబుతున్నారు. అందులో మొదటిది ప్రధాని నరేంద్రమోదీ తమ రాష్ట్రం వాడు కావడం, రెండోది బుల్లెట్ రైలు ప్రాజెక్టు. దేశంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాలున్నా బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు మోదీ గుజరాత్‌ను ఎంచుకున్నారు. గుజరాత్ ప్రజలు తమ వాణిజ్య అవసరాల కోసం ఎక్కువగా వాణిజ్య రాజధాని ముంబైకి వెళ్తుంటారు. దీనిని సరిగ్గా గుర్తించిన మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టుకు మోదీ ఇటీవలే శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని మోదీ పట్టించుకోవడం లేదన్న అపోహలను ఈ ప్రాజెక్టు తుడిపేసింది.

మరోవైపు ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు గుప్పించడంతో ప్రజలు వాటివైపు నుంచి క్రమంగా దూరంగా జరిగి బీజేపీకి దగ్గరయ్యారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా బుల్లెట్ రైలు ప్రాజెక్టు తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని బీజేపీ, ముఖ్యంగా మోదీ బలంగా నమ్మారు. కాంగ్రెస్ కూడా ఈ విషయాన్ని గ్రహించే బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై విమర్శలు చేసింది. అలాగే ఇక్కడ బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ‘నీచ్’ వ్యాఖ్యలు కూడా ఓ కారణమని చెబుతున్నారు.  

More Telugu News