asaduddin owaisi: ఇలాగైతే బీజేపీని ఓడించడం అసాధ్యం: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

  • బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒకటి కావాలి
  • జాయింట్ ఫ్రంట్ రావాలి
  • బీజేపీ ఒక యంత్రంలా పని చేసుకుంటూ పోతోంది

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, గుజరాత్ లో ముస్లింలను మరింత అణగదొక్కారనేదానికి ఈ ఫలితాలే నిదర్శనమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు గుళ్లు, గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేశారని... ఓట్ల కోసమే వీరు ఇలాంటి చర్యలకు దిగారని విమర్శించారు. గుజరాత్ లో బీజేపీని మట్టికరిపించడానికి కాంగ్రెస్ కు మంచి అవకాశం వచ్చిందని, కానీ ఆ పార్టీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. గుజరాత్ లో వ్యాపారులు ఎక్కువగా ఉన్న సూరత్ లో కూడా బీజేపీ హవా చాటిందని... జీఎస్టీపై కాంగ్రెస్ గొంతు చించుకున్నా ఫలితం దక్కలేదని అన్నారు.

దేశంలో ఒక యంత్రంలా బీజేపీ పని చేస్తోందని... బీజేపీకి వ్యతిరేకంగా ఒక జాయింట్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని ఒవైసీ తెలిపారు. అఖిలేష్ కానీ, అసదుద్దీన్ ఒవైసీ కానీ, మమతా బెనర్జీ కానీ, ఎవరైనా సరే ఒంటరిగా బీజేపీని ఓడించడం చాలా కష్టమని, అందరూ కలిస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. మరోవైపు, బీజేపీ గెలుపు ఎల్లకాలం ఇలానే ఉండదని... రాజకీయాల్లో తార స్థాయిలో ఉన్న సమయంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు ఓటర్లు వ్యతిరేక ఫలితాలను రుచి చూపించారని గుర్తు చేశారు. గుజరాత్ లో మంచి ఫలితాలు సాధించామని బీజేపీ భావిస్తే అది పొరపాటేనని... ఔరంగజేబ్, పాకిస్థాన్ పేర్లను వాడుకుని బీజేపీ ఎల్లకాలం గెలవలేదని అన్నారు. 

More Telugu News