facebook: నిరుపేద 'ఇంటి'కి ఫేస్‌బుక్ పోస్టు ద్వారా సాయం!

  • మంచిర్యాల‌లో ఓ కుటుంబానికి అండ‌
  • ఇల్లు క‌ట్టించేందుకు స‌హాయం చేసిన ఫేస్‌బుక్ మిత్రులు
  • ఆనంద‌ప‌డిన నిరుపేద కుటుంబం

సామాజిక మాధ్య‌మం ఫేస్‌బుక్ ద్వారా వినోదం, ఆనంద‌మే కాదు.. కొన్నిసార్లు నిరుపేద‌ల‌కు, ఆప‌ద‌లో ఉన్న వారికి సహాయం చేసే అవ‌కాశం కూడా దొరుకుతుంది. ఆ అవ‌కాశం స‌ద్వినియోగం చేసుకునే వాళ్లు చాలా త‌క్కువ మంది ఉంటారు. జ‌గిత్యాల‌కు చెందిన సామాజిక సేవ‌కుడు రేణికుంట ర‌మేశ్ ఆ కోవ‌కు చెందిన‌వారే. ఫేస్‌బుక్ వార‌ధిగా ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు క‌ట్టించి ఇవ్వ‌గ‌లిగాడు.

వివ‌రాల్లోకి వెళ్తే... మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన బోర్లకుంఠ వెంకటి, పద్మ దంపతులకు ముగ్గురు కూతుళ‍్లు. వృద్ధులైన వెంకటి తల్లిదండ్రులు వారితోపాటు ఉంటున్నారు. జీవనోపాధి కోసం వెంకటి ఇరాక్‌కు వెళ్లగా.. పద్మ కూలీపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వారంతా క‌లిసి ఉండేది ఓ గుడిసెలో. అయితే కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు గుడిసె కాలిపోయి వారంతా నిరాశ్రయులయ్యారు.

వారి ప‌రిస్థితి చూసిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్‌, వారి దీనస్థితి గురించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆ పోస్టుకు స్పందించిన కొంద‌రు ప‌ద్మ బ్యాంకు ఖాతాకు రూ.65 వేలు విరాళంగా పంపించారు. అంతేకాకుండా గ్రామ సర్పంచ్‌ దర్శనాల వెంకటస్వామి ఆధ్వర్యంలో శివాజీ యూత్‌ మిత్రులు మరో రూ.90 వేలు సేకరించారు. ఈ డ‌బ్బుతో వారికి ఇంటిని నిర్మించ‌గ‌లిగారు.

More Telugu News