royal caribbean cruise ship: రాయల్ కరీబియన్ క్రూయిజ్ షిప్ లో వందలాది మందికి అస్వస్థత

  • కడుపునొప్పితో బాధపడ్డ 332 మంది ప్రయాణికులు
  • పరిశుభ్రతను మరింత మెరుగు పరుస్తామన్న క్రూయిజ్ ప్రతినిధి
  • ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందన్న ప్రయాణికులు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాయల్ కరీబియన్ క్రూయిజ్ షిప్ లో వందలాది మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఫైవ్-నైట్స్ క్రూయిజ్ కోసం ఫ్లోరిడా నుంచి బయల్దేరిన షిప్ లోని ప్రయాణికుల్లో 332 మంది కడుపునొప్పితో బాధ పడ్డారు. రాయల్ కరీబియన్ ప్రతినిధి ఓవెన్ టురోస్ ఈ విషయాన్ని వెల్లడించారు.

షిప్ లో 5వేల మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని... వారిలో దాదాపు 6 శాతం మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారికి షిప్ లోని డాక్టర్లు వైద్యం చేశారని... త్వరలోనే వీరు కోలుకుంటారని చెప్పారు. పరిశుభ్రతకు సంబంధించి మరిన్ని మెరుగైన చర్యలు చేపడతామని, తదుపరి క్రూయిజ్ సమయానికల్లా ఈ చర్యలు పూర్తవుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో షిప్ తిరిగి ఫ్లోరిడాకు చేరుకుంది.

ఎందువల్ల ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారో మాత్రం ఇంత వరకు వెల్లడి కాలేదు. మరోవైపు, రాయల్ కరీబియన్ క్రూయిజ్ చెబుతున్నవారి కంటే ఎక్కువ మందే అస్వస్థతకు గురయ్యారని కొందరు ప్రయాణికులు తెలిపారు. షిప్ లోకి వచ్చిన వెంటనే వాంతులు చేసుకున్నారని, డయేరియాకు గురయ్యారని చెప్పారు. 

More Telugu News