Chandrababu: చంద్రబాబును కేసీఆర్ ఆహ్వానించాలనుకున్నారు... బాబు రాలేనని చెప్పారు: అధికార వర్గాలు

  • తెలుగు మహా సభలకు బాబును పిలవలేదని విమర్శలు
  • 19వ తేదీ చివరి రోజుకు ఆహ్వానించాలనుకున్న కేసీఆర్
  • అప్పటికే మాల్దీవుల పర్యటనను ఫిక్స్ చేసుకున్న చంద్రబాబు
  • ఇద్దరి మధ్యా సత్సంబంధాలే ఉన్నాయన్న అధికారులు

అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో సాగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలకలేదన్న విషయమై విమర్శలు వస్తుండగా, రెండు రాష్ట్రాల అధికార వర్గాలు స్పందించాయి. వారు వెల్లడించిన వివరాల ప్రకారం, తెలుగు మహాసభలకు చంద్రబాబును ఆహ్వానించాలని భావించిన కేసీఆర్, స్వయంగా వెళ్లి పిలవాలని భావించి, చంద్రబాబుకు ఎప్పుడు వీలవుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలని అధికారులకు సూచించారట.

రాష్ట్రపతి పాల్గొనే చివరి రోజైన 19వ తేదీన చంద్రబాబును ఆహ్వానించాలని కేసీఆర్ భావించారట. ఇదే విషయాన్ని అధికారుల ద్వారా సమాచారాన్ని పంపగా, తన ప్రోగ్రామ్ అప్పటికే ఫిక్స్ అయిందని, 17వ తేదీ నుంచి తాను ఇండియాలో ఉండటం లేదని ఆయన్నుంచి రిప్లై వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. తన కుటుంబ సభ్యులతో మాల్దీవులకు చంద్రబాబు ప్రయాణం అవుతుండబట్టే ఆయన రాలేకపోయారని, అంతకు మించి మరేమీ లేదని, ఇద్దరి మధ్యా సత్సంబంధాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

More Telugu News