TTD: రేపటి నుంచి క్యూలైన్ లోకి వెళ్తే రెండు గంటల్లోనే వెంకన్న దర్శనం... టీటీడీ వినూత్న ప్రయత్నం!

  • సాధారణ రోజుల్లో దర్శనానికి కనీసం ఆరు గంటల సమయం
  • ఇకపై క్యూలోకి ప్రవేశిస్తే సత్వర దర్శనం
  • ఆధార్ కార్డున్న ప్రతి ఒక్కరికీ శీఘ్ర దర్శనం
  • ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన టీటీడీ

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రెండు గంటల్లోనే దర్శనం చేయించేలా టీటీడీ తయారు చేసిన వినూత్న టైమ్ స్లాట్ విధానాన్ని రేపటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఒక్కోసారి క్యూలైన్ లోకి వెళితే, దర్శనం చేసుకునేందుకు సాధారణ రోజుల్లో కనీసం 6 నుంచి 10 గంటలకు పైగా, వీకెండ్ లో 20 గంటల వరకూ సమయం పడుతుందన్న సంగతి తెలిసిందే.

ఇక, కొత్త విధానంలో భాగంగా, తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా, భక్తులు తాము దర్శనానికి ఎప్పుడు వెళ్లాలన్న విషయాన్ని ముందే నమోదు చేయించుకోవచ్చు. రద్దీని బట్టి, దర్శన సమయం, టోకెన్ తీసుకునే సమయానికి కనీసం నాలుగు గంటల సమయం తరువాత ఉంటుంది. ఆపై భక్తులు సమయానికి క్యూ కాంప్లెక్స్ లోపలికి చేరుకుంటే, రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. కాగా, టైమ్ స్లాట్ విధానానికి ఆధార్ కార్డు తప్పనిసరని, ముందుగా సమయం తీసుకోకుండా కూడా క్యూ లైన్లలోకి వెళ్లి ప్రస్తుతం అమలవుతున్న విధానంలో దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

More Telugu News