Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. విమాన ప్రయాణికుల్లా ఇక రాయితీలు!

  • ఫ్లెక్సీ-ఫేర్ విధానాన్ని రివ్యూ చేస్తున్న రైల్వేశాఖ
  • విమానయాన సంస్థలు, హోటల్ రూముల్లా టికెట్లపై రాయితీ
  • టికెట్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం

రైలు ప్రయాణికులకు ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుభవార్త చెప్పారు. విమానయాన సంస్థలు, హోటళ్ల తరహాలో ఇకపై రైల్వే టికెట్లకూ రాయితీలు వర్తింపజేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫ్లెక్సీ-ఫేర్ విధానాన్ని పూర్తిగా నవీకరిస్తామని పేర్కొన్నారు. ఈ విధానాన్ని రివ్యూ చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు.

శనివారం రోజంతా సీనియర్ అధికారులతో సమావేశమైన మంత్రి అనంతరం మాట్లాడుతూ రైల్వేలో డైనమిక్ ప్రైసింగ్ పాలసీని అమల్లోకి తెస్తామన్నారు. విమానయాన సంస్థల్లో రాయితీలు ఇస్తున్నట్టుగా రైల్వేలోనూ ఇస్తామన్నారు. పూర్తిగా నిండని రైళ్లలో టికెట్లపై రాయితీలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు.

‘బుక్ మై షో’ తదితర వెబ్‌సైట్లలో హోటల్ రూములు బుక్ చేసుకునేటప్పుడు తొలుత చవగ్గా అందుబాటులో ఉంటాయని, తర్వాత పెరుగుతాయని, ఆ తర్వాత మిగతా రూములకు  డిస్కౌంట్లు ఆఫర్ చేస్తారని, అదే విధానాన్ని రైల్వేలోనూ అమలు చేస్తామని వివరించారు. ఫ్లెక్సీ-ఫేర్ విధానాన్ని సమీక్షించేందుకు ఈనెల 11న ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. రైల్వే టికెట్లపై రాయితీలు ఇచ్చే విషయాన్ని అధ్యయనం చేసిన అనంతరం కమిటీ చేసే ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తుంది. అనంతరం ఈ రాయితీలను అమలు చేస్తారు. కాగా, ఫ్లెక్సీ-ఫేర్ విధానాన్ని గతేడాది సెప్టెంబరులో ప్రారంభించారు. ఈ ఫార్ములాలో చార్జీలు 50 శాతం వరకు పెరిగాయి.

More Telugu News