Amaravati: అమరావతి అసెంబ్లీ డిజైన్ 'ఇడ్లీ పాత్ర'లా ఉందా?: సోషల్ మీడియా కామెంట్లపై చంద్రబాబు మండిపాటు

  • సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ప్రచారం
  • 100కు పైగా డిజైన్ల నుంచి ఎంపిక చేశామన్న చంద్రబాబు
  • అభ్యంతరాలుంటే ముందే చెప్పాల్సిందని మండిపాటు
  • ఈ డిజైన్లు ప్రపంచంలోనే అత్యుత్తమమని వెల్లడి

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన శాశ్వత అసెంబ్లీ భవనానికి స్థూపాకార డిజైన్ ను ఎంపిక చేసిన నేపథ్యంలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గురించి తెలుసుకుని చంద్రబాబు మండిపడ్డారు. నూతన అసెంబ్లీ భవన ఆకృతి ఇడ్లీ పాత్ర మాదిరిగా ఉందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతున్న వేళ, మంత్రుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు, అత్యుత్తమ సంస్థలతో 100కు పైగా డిజైన్లు గీయించి, వాటి నుంచి ప్రజామోదం పొందిన డిజైన్ ను ఎంపిక చేస్తే, ఇటువంటి ప్రచారం చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.

భవన ఆకృతి ఇడ్లీ పాత్రలా, కుక్కర్ గిన్నెలా ఉందని అనుకుంటే, ఆ విషయాన్ని ముందే చెప్పి ఉండవచ్చని అన్నారు. అమరావతి ఆకృతులపై ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. అమరావతి నిర్మాణాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పేరు తెచ్చుకుంటాయని చెప్పడంలో తనకు ఎటువంటి సందేహమూ లేదని స్పష్టం చేశారు. పోలవరంపై గడ్కరీతో జరిగిన సారాంశం వివరాలను సీఎం చంద్రబాబు తన సహచరుల వద్ద ప్రస్తావించారు. పెరిగిన పునరావాసం, నిర్మాణ ఖర్చులను కేంద్రం అందిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. ప్రాజెక్టుపై భాజాపా నేతలు కూడా సానుకూలంగా ఉన్నారని, వారు ఢిల్లీ వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నారని తెలిపారు.

More Telugu News