KTR: మరో వినూత్న ప్రయోగానికి తెరదీసిన తెలంగాణ‌ మంత్రి కేటీఆర్‌!

  • ‘మన నగరం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్‌
  •  పురపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకే
  •  నగరంలోని అన్ని సర్కిళ్లలో రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం
  •  ప్రజల అండతోనే విశ్వనగరం సాధ్యం- కేటీఆర్

'మ‌నం మారుదాం...మ‌న న‌గ‌రాన్ని మారుద్దాం'...అనే స్ఫూర్తిని ప్ర‌తి ఒక్క‌రిలో క‌లిగించేందుకు 'మ‌న న‌గ‌రం' కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్న‌ట్టు రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పుర‌పాలన రంగంలో వినూత్నంగా చేప‌ట్టిన మ‌న న‌గ‌రం ప్రారంభ కార్యక్ర‌మాన్ని కుత్బుల్లాపూర్‌లో ఆయ‌న ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి, ఎంపీ మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... న‌గ‌రం నాది, మ‌న‌ది అనే సామాజిక స్పృహ‌తోనే స్వ‌చ్ఛ హైద‌రాబాద్ సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. స్వ‌చ్ఛ న‌మ‌స్కారం అని త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభిస్తూ స‌మ‌స్య‌ల అద్య‌య‌నం, ప‌రిష్కారంతో పాటు ప్ర‌జ‌ల ఆలోచ‌న విధానానికి అనుగుణంగా న‌డ‌వ‌డ‌మే మ‌న న‌గ‌ర కార్యక్రమ ప్ర‌ధాన ఉద్దేశ‌మని వివ‌రించారు. నిజాయతీగా చిత్త‌శుద్ధితో స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదికే 'మ‌న న‌గ‌రం' అని స్ప‌ష్టం చేశారు. దేశంలో శ‌ర‌వేగంగా అభివృద్ది చెందుతున్న న‌గ‌రం హైద‌రాబాద్ అని, ఈ న‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా అభివృద్ది చేయ‌డానికి స్ల‌మ్‌లెస్ సిటీ, ఎస్‌.ఆర్‌.డి.పి, స్వ‌చ్ఛ‌త‌, మౌలిక స‌దుపాయాల అభివృద్ధి త‌దిత‌ర ఎన్నో మెగా కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని గుర్తుచేశారు.

అప్ప‌ట్లో క‌రెంటు కోత‌లు అధికం..
ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు హైద‌రాబాద్ న‌గ‌రంలో వారానికి రెండు రోజులు విద్యుత్ కోత‌లు, ప‌వ‌ర్ హాలిడేలు, త్రాగునీటి కొర‌త త‌దిత‌ర ఎన్నో స‌మ‌స్య‌లు ఉండేవ‌ని, ప్ర‌త్యేక రాష్ట్రం ఆవిర్భావం అనంత‌రం సంవ‌త్స‌రంలోపే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకున్నామ‌ని చెప్పారు. అధికార వికేంద్రీక‌ర‌ణ ద్వారానే మెరుగైన పౌర సేవ‌లు అందించాల‌న్న‌దే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌న్నారు. దీనిలో భాగంగా ప్ర‌స్తుతం ఉన్న 30 స‌ర్కిళ్ల‌కు మరిన్ని అదనంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌ని అన్నారు. ప్ర‌తి ప‌ని డ‌బ్బుల‌తో సాధ్యం కాద‌ని, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే ఎన్నో ఉత్త‌మ ఫ‌లితాలు వ‌స్తాయ‌ని దీనికి నిద‌ర్శ‌నం హైద‌రాబాద్ న‌గ‌రంలోని అనేక స్వ‌చ్ఛ కాల‌నీలని అన్నారు.  

 ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం కావాలి
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల 13,800 మంది వార్డు, ఏరియా క‌మిటి స‌భ్యులను నియ‌మించామ‌ని, వీరంద‌రి భాగ‌స్వామ్యంతో, ప్ర‌జ‌ల‌ను మ‌మేకం చేస్తూ హైద‌రాబాద్ న‌గ‌రాన్ని దేశంలోనే స్వ‌చ్ఛ న‌గ‌రంగా రూపొందించేందుకు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు. దేశంలోని ప్ర‌ధాన నగ‌రాల‌తో పోల్చిచూస్తే హైద‌రాబాద్ న‌గ‌రంలో క్రైం రేట్ చాలా త‌క్కువ‌గా ఉన్నందునే పెట్టుబ‌డుల ప్ర‌వాహం మ‌న న‌గ‌రానికి ఉంద‌ని అన్నారు. న‌గ‌ర శివారు ప్రాంతాల్లో ఇంటింటికి న‌ల్లా క‌నెక్ష‌న్లు ఇచ్చే భ‌గీరథ ప్ర‌య‌త్నం మ‌రికొన్ని రోజుల్లోనే సాధ్యం కాబోతుంద‌ని పేర్కొన్నారు.

 ప్ర‌తి ఇంటిలో విధిగా నీటి ఇంకుడు గుంతలు
ప్ర‌తి ఇంటిలో విధిగా నీటి ఇంకుడు గుంత‌ల‌ను ఏర్పాటు చేసుకునే ప్ర‌క్రియ‌ను జ‌న‌వ‌రి నుండి ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు. అదేవిధంగా ప్ర‌తి ఇంటినుండి త‌డి, పొడి చెత్త‌ను వేర్వేరుగా చేసి స్వ‌చ్ఛ ఆటోల‌కు అందించే విధానాన్ని మిష‌న్ మోడ్‌తో చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. ఈ రోజు చేపట్టిన కార్యక్రమంలో దాదాపు మూడున్న‌ర గంట‌ల పాటు మ‌న న‌గ‌రం కార్య‌క్ర‌మానికి హాజ‌రైన స్వ‌చ్ఛంద సంస్థ‌లు, బ‌స్తీ, ఏరియా క‌మిటీ స‌భ్యులు, స్వ‌చ్ఛ సీఆర్‌పీలు, కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధుల‌తో వివిధ ప‌థ‌కాల అమ‌లుపై వారి అభిప్రాయాల‌ను సేక‌రించారు.

త‌మ కాల‌నీలు, బ‌స్తీల్లో ఉన్న దీర్ఘకాలిక సమ‌స్య‌ల‌ను విని సంబంధిత అధికారులచే అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్కార మార్గాల‌ను మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు స్వ‌చ్ఛ కాల‌నీల‌కు ప్ర‌త్యేక పుర‌స్కారాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జనార్దన్ రెడ్డి, జ‌ల‌మండ‌లి ఎండీ దానకిషోర్‌, మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ ఎం.వి.రెడ్డి, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు, కార్పొరేట‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

More Telugu News