mla rajasingh: ప్రతీ హిందువు ఖడ్గం పట్టుకోవాలి... మతం కోసం చంపేందుకు సిద్ధంగా ఉండాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు

  • కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో ఓ సభలో వ్యాఖ్యలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • ‘శ్రీరామ్ సేన’ ప్రమోద్ ముతాలిక్ పైనా కేసు నమోదు

హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాలోధాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతీ హిందువు తన ఇంట్లో ఖడ్గాన్ని సిద్ధం చేసుకోవాలని, అవసరం ఏర్పడినప్పుడు మత వ్యతిరేకులపై ఎదురు దాడి చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో గురువారం రాత్రి జరిగిన హిందు విరాట్ సమ్మేళన్ కార్యక్రమం ఇందుకు వేదిక అయింది.

‘‘సమీప భవిష్యత్తులో ప్రతీ హిందూ యువకుడు ఉగ్రవాదంపై పోరాడేందుకు కత్తిని ఝుళిపించాల్సిన అవసరం ఉంది. ఒక్క కత్తితో మనం ఏమీ చేయలేం. మనకు మరిన్ని కావాలి. అవసరం ఏర్పడితే మతం కోసం చంపేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. ఐదువేల మంది హిందువులను మత మార్పిడి చేయించిన టిప్పు సుల్తాన్ జయంతిని కర్ణాటక సర్కారు అధికారికంగా నిర్వహించడాన్ని కూడా అయన తప్పుబట్టారు.

ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో యాదగిరి పోలీసులు ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు చేశారు. సుమోటో కేసుగా తీసుకున్నట్టు కర్ణాటక నార్త్ ఈస్ట్రన్ రీజియన్ ఐజీ అలోక్ కుమార్ మీడియాకు తెలిపారు. రాజాసింగ్ వివాదాస్పద, విద్వేషపూరిత ప్రసంగం చేశారని చెప్పారు. ఇదే వేదికపై ఇద్దరు, ముగ్గురు కత్తులను కూడా దూశారని తెలిపారు. రాజాసింగ్ తోపాటు శ్రీరామ్ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్, మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్టు ఐజీ చెప్పారు.

More Telugu News