harvard: హార్వార్డ్ విశ్వ‌విద్యాల‌యంలో సీటు దొరికితే ఆ ఆనందం ఎలా ఉంటుందో తెలుసా?... ఈ వీడియో చూడండి!

  • ఆక‌ట్టుకుంటున్న లూసియానా విద్యార్థి వీడియో
  • వైర‌ల్ అవుతున్న ఆర్ట‌న్ లిటిల్ వీడియో
  • అప్పుడే జాబ్ ఆఫ‌ర్ కూడా పొందిన ఆర్ట‌న్‌

క‌ష్ట‌ప‌డి చ‌దివిన వారికి ఫ‌లితం ద‌క్కుతుంద‌ని లూసియానాకు చెందిన ఆర్ట‌న్ లిటిల్ మ‌రోసారి నిరూపించాడు. 16 ఏళ్ల వ‌య‌సులో ప్రతిష్ఠాత్మ‌క హార్వార్డ్ విశ్వ‌విద్యాల‌యంలో సీటు సంపాదించాడు. అయితే ఆ విష‌యం తెలిసిన‌పుడు అత‌ని ముఖంలో క‌నిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆర్ట‌న్ చ‌దువుతున్న బ్రాక్స్ బ్రిడ్జిలోని టీఎం లాండ్రీ కాలేజ్ గ‌త మూడేళ్లుగా, ఏడాదికి ఒక‌రు చొప్పున హార్వార్డ్‌కి పంపిస్తోంది. ఆ విధంగా ఈ ఏడాది ఆర్ట‌న్ ఎంపిక‌య్యాడు.

దానికి సంబంధించిన మెయిల్ చెక్ చేసుకుంటున్న‌ప్ప‌టి వీడియోను ఆర్ట‌న్ పోస్ట్ చేశాడు. తాను హార్వార్డ్‌లో చ‌దువుకోబోతున్న‌ట్లు తెలిసి ఉబ్బిత‌బ్బిబ్బ‌వ‌డం వీడియోలో చూడొచ్చు. ప‌క్క నుంచి అత‌ని స్నేహితులు కూడా ఆనందాన్ని పంచుకోవ‌డం వీడియోలో క‌నిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది.

వీడియోలో ఆర్ట‌న్ పొందుతున్న ఆనందం త‌మ‌కు క‌ళ్ల నుంచి నీళ్లు వ‌చ్చేలా చేస్తోంద‌ని కొంత‌మంది నెటిజ‌న్లు అన్నారు. అంతేకాదు.. ఈ వీడియో చూసిన యూట్యూబ్ గేమింగ్ హెడ్ ర్యాన్ వాయ‌ట్‌, డిగ్రీ పూర్తి చేసుకుని రాగానే గూగుల్‌లో జాబ్ సిద్ధంగా ఉంటుంద‌ని ఆఫ‌ర్ కూడా ఇచ్చారు. తాను కంప్యూట‌ర్ సైన్స్ తీసుకుని పిల్ల‌లు చ‌దువుకోవ‌డానికి ఓ స్వ‌చ్ఛంద సంస్థ ఏర్పాటు చేస్తాన‌ని ఆర్ట‌న్ అన్నాడు.

More Telugu News