telangana: తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో మరో కలికితురాయి!

  • హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ ఏరోస్పేస్ పెట్టుబడి
  • జీఈ, టాటా గ్రూపు కలసి వైమానిక ఇంజన్ల తయారీకి అవగాహన‌ ఒప్పందం
  • మిలటరీ ఇంజన్లు, ఇతర వైమానిక వ్యవస్థల తయారీ
  • అంతర్జాతీయ ఎగుమతికి CFM LEAP ఇంజన్లు  

తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే ఏరోస్పేస్ రంగంలో తనదైన ముద్రవేసుకున్న హైదరాబాద్ నగరంలో మరొక అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడి పెడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత జీఈ గ్రూప్, టాటా కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, జీఈ గ్రూపు కలిసి మిలటరీ ఇంజన్లు, ఇతర వైమానిక ప‌రిక‌రాల‌ను త‌యారు చేస్తాయి. అలాగే ఇక్కడ నుంచి తయారు చేసే CFM LEAP ఇంజన్లను అంతర్జాతీయంగా సప్లై చేయనున్నారు.  

గ‌తంలో తెలంగాణ‌ మంత్రి కేటీఆర్‌ టాటా సంస్థ, జీఈతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో తాజాగా డిల్లీలో మరోసారి ఆయా సంస్థ‌ల‌  చైర్మన్‌ల‌తో సమావేశం అయ్యారు. విమాన ఇంజన్ తయారీ, కాంపొనెంట్ లతోపాటు రానున్న కాలంలో హైదరాబాద్ నుంచే మిలటరీ విమానాల ఇంజన్లు, ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలకు సంబంధించిన ఇతర పరికరాల తయారీ అవకాశాలను కూడా పరిశీలించనున్నట్లు కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈరోజు తెలిపింది.

ఈ వ్యూహాత్మక ఒప్పందం ద్వారా జీఈ ఏవియేషన్, హైదరాబాద్‌లో ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టాసిల్) కలసి ఎయిర్ క్రాప్ట్ కాంపోనెంట్స్ తయారీ, అసెంబ్లింగ్, టెస్టింగ్ వంటి రంగాల్లో కలిసి పనిచేస్తాయి. దీంతోపాటు కొత్తగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేసి, ఎయిర్ క్రాప్ట్ ఇంజన్ తయారీకి అవసరం అయిన ఈకోసిస్టమ్ ను ఏర్పాటు చేస్తారు.

  ఈ ఇంజన్ ప్రపంచంలోనే ప్రముఖమైన ఎయిర్ క్రాప్ట్
ఇక్కడి నుంచి తయారు చేయనున్న ఈ ఇంజన్ ప్రపంచంలోనే ప్రముఖమైన ఎయిర్ క్రాప్ట్ ఇంజన్ గా పేరు పొందింది. ఈ రంగంలో రానున్న ఇతర భాగస్వామ్యాలకు కూడా ఈ ఇంజన్ తయారీ అంశం ఒక కీలకమైన అంశంగా ఉండబోతున్నది. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో హైదరాబాద్ కు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

మేకిన్ ఇండియా స్ఫూర్తికి అనుగుణంగా..
టాటా సంస్థ భారతదేశ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగంలో అగ్రగామిగా ఉన్నదని, లీఫ్ ఇంజన్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో తమ సంస్థ టాటాతో చేసుకున్న భాగస్వామ్యం ద్వారా ఆ డిమాండ్‌ను అందుకోగలమని జీఈ సంస్ధ చైర్మన్ జాన్ ఏల్ ఫ్లానరీ అన్నారు. టాటా సంస్థతో చేసుకున్న భాగస్వామ్యం మేకిన్ ఇండియా స్ఫూర్తికి అనుగుణంగా రానున్న రోజుల్లో మరిన్ని నూతన సాంకేతికతలను అభివృద్ధి చేసే దిశగా కొనసాగుతుందని అయన తెలిపారు.

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ నిపుణత, సామర్థ్యాలను పెంచుతుంది..

జీఈతో భాగస్వామ్యం భారతదేశంలోని ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ నిపుణత, సామర్థ్యాలను మరింతగా పెంచుతుందని టాటా చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. భారత దేశ రక్షణ దళాల అవసరాలకు అనుగుణంగా నూతన రక్షణ రంగ ఉత్పత్తుల తయరీకి ఈ ఒప్పందం సహకరిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఎయిరో స్పేస్ రంగానికి ఈ ఒప్పందం మరింత ఉతం ఇస్తుందని మంత్రి కేటీ రామరావు అన్నారు. నిన్న జరిగిన సమావేశంలో జీఈ సంస్ధ చైర్మన్ జాన్ ఫ్లానరీకి తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎయిరో స్పేస్ తయరీ రంగానికి ఆది నుంచి అండగా ఉన్న టాటాసంస్ధకు, రతన్ టాటాకు, సంస్ధ చైర్మన్ చంద్రశేఖరన్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.        

More Telugu News