సోనియా గాంధీ: రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న సోనియా గాంధీ...ప్రకటించిన కాంగ్రెస్ అధినేత్రి

  • రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా
  • పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తూ మీడియాతో మాట్లాడిన అధినేత్రి
  • కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ రేపు బాధ్యతల స్వీకరణ

రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గుడ్ బై చెప్పనున్నారు. ఈ మేరకు ఆమె సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి రిటైర్ కానున్నట్టు ఆమె ప్రకటించారు. పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో మీడియా ముందు సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలకు ఆమె హాజరయ్యారు. సభ వాయిదా అనంతరం, ఆమె బయటకు వెళ్తున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పార్టీలో మీ పాత్ర ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ,‘నేను విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని ప్రకటించారు. అయితే, రాజకీయాల నుంచి తప్పుకునే విషయమై ఆమె ఎటువంటి వివరాలను ప్రకటించకపోవడం గమనార్హం.

కాగా, సోనియా భర్త రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఏడేళ్లు రాజకీయాలకు దూరంగా ఇందిరా గాంధీ కుటుంబం ఉంది. ఆ తర్వాత సోనియా రాజకీయాల్లోకి వచ్చారు. పందొమ్మిది ఏళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా బాధ్యతలు నిర్వహించారు. సోనియా తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. కేన్సర్ కు సంబంధించిన చికిత్స పొందుతున్న ఆమె ఇటీవలే అమెరికా కూడా వెళ్లారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ తరుణంలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో ఆసక్తి కలిగించాయి.

More Telugu News