ATM: రాత్రి 9 తర్వాత ఏటీఎంలలో నగదు నింపొద్దు.. కేంద్రం ఆంక్షలు!

  • నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 లోపే నగదు నింపాలని సూచన
  • వ్యాన్‌లో రూ.5  కోట్ల కంటే ఎక్కువ తరలించవద్దని ఆంక్షలు
  • హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదన

ఏటీఎంలలో నగదు నింపే విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు తరలించే వ్యాన్లపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో పలు కీలక  సూచనలు చేసింది. రాత్రి 9 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఏటీఎంలలో నగదు నింపే ప్రయత్నం చేయవద్దని బ్యాంకు అధికారులకు సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలలోపే ఏటీఎంలలో నగదు నింపే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆంక్షలు విధించింది. ఇందుకోసం నగదును తరలించే వాహనాలు, ప్రైవేటు ఏజెన్సీలు ఉదయాన్నే బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకెళ్లాలని పేర్కొంది.

 జీపీఎస్ సౌకర్యం ఉండి, సీసీ కెమెరాల ఏర్పాటు ఉన్న వాహనంలో ఒకసారి రూ.5 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకెళ్లవద్దని హోంమంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలన కోసం దీనిని పంపింది. అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 వేల ప్రైవేటు వాహనాలు రోజూ రూ.15 వేల కోట్లను బ్యాంకుల నుంచి ఏటీఎంలకు తరలిస్తున్నాయి.

More Telugu News