మంచిర్యాల: మరదలికి ఉద్యోగం కోసం కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. పోలీసుల అదుపులో ఓ న్యూస్ ఛానెల్ విలేకరి!

  • ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పించడం కోసం నకిలీ పత్రాలు
  • అధికారుల అనుమానంతో బయటపడ్డ విషయం
  • మంచిర్యాలలో సంఘటన

తన మరదలికి ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పించడం కోసం కలెక్టర్ సంతకాన్ని ఓ న్యూస్ ఛానెల్ విలేకరి ఫోర్జరీ చేసిన సంఘటన మంచిర్యాలలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... ఓ న్యూస్ ఛానెల్ విలేకరిగా పని చేస్తున్న సంతోష్, తన మరదలు రాజమణికి ఏఎన్ఎం పోస్టు ఇప్పించాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో రాజమణి పేరుతో కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాలు సృష్టించి నెన్నెల ఆరోగ్య కేంద్రంలో సమర్పించాడు.

అయితే, అక్కడి అధికారులు తిరస్కరించడంతో, మంచిర్యాల డీఎం అండ్ హెచ్ ఓను కలిసి రాజమణికి పోస్టింగ్ ఇవ్వాలని కోరాడు. ఆ పత్రాలను చూసిన అధికారికి అనుమానం తలెత్తడంతో వాటిని తీసుకుని నేరుగా కలెక్టరేట్ కు వెళ్లి, కలెక్టర్ కర్ణన్ కు చూపించారు. ఆ సంతకం తనది కాదని కలెక్టర్ తెలిపారు. డీఎం అండ్ హెచ్ ఓ ఫిర్యాదు మేరకు సంతోష్, రాజమణిలపై కేసు నమోదు చేశామని, నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని మంచిర్యాల ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.  

More Telugu News