రోజా: రోజా - బండ్ల గణేష్ మధ్య జరిగింది వాగ్వాదం కాదు తిట్ల పురాణం: మహేష్ కత్తి

  • ఈ సంఘటన జరగడం దురదృష్టకరం
  • రోజా ఎమ్మెల్యే కనుక, ఆమెపై ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది
  • బండ్ల గణేష్ స్పందించిన తీరూ అంత ఆమోదయోగ్యం కాదు
  • ఓ ట్వీట్ తో పాటు వీడియో పోస్ట్ చేసిన మహేష్ కత్తి

వైసీపీ ఎమ్మెల్యే రోజా, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మధ్య ‘టీవీ 9’ చర్చా కార్యక్రమంలో ఇటీవల మాటల తూటాలు పేలిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఫిల్మ్ క్రిటిక్ మహేష్ కత్తి స్పందించారు. తాను కేవలం ఫిల్మ్ క్రిటిక్ నే కాదని, సామాజిక అంశాలపైనా వ్యాఖ్యలు చేస్తానని అన్నారు. ‘ఈ విషయం తెలిసిన వాళ్లకు మళ్లీ ప్రత్యేకంగా నేను గుర్తు చేయక్కర్లేదు. కానీ, ఈ విషయం తెలియని వాళ్లకు తెలియజెప్పడం నా బాధ్యత’ అని తన ట్వీట్ లో పేర్కొన్న మహేష్ కత్తి, రోజా- బండ్ల గణేష్ మాటల యుద్ధంపై స్పందిస్తూ ‘మోజో టీవీ’లో తాను మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు.

‘‘టీవీ 9’లో రోజాకు, బండ్ల గణేష్ కు జరిగింది వాగ్వాదం కాదు తిట్ల పురాణం అని అనిపిస్తోంది. ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. బండ్ల గణేష్ ఓ బాధ్యతాయుతమైన ప్రొడ్యూసర్. పవన్ కల్యాణ్ కు అభిమానై ఉండొచ్చు కానీ, రోజా గారు ఓ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎవరైనా తమపై తాము నియంత్రణ కోల్పోతే.. సమాజంలో వారి విలువ తగ్గడమో, కోల్పోవడమో జరుగుతుంది. చర్చలు చర్చలుగా ఉండకుండా, రచ్చలుగా, రభసలుగా తయారవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు అంగీకరించకపోయినా, తృణీకరించినా కూడా ఈ స్థాయి భాషను పబ్లిక్ డొమైన్ లో వాడటం అటు పార్టీకీ మంచిది కాదు’ అన్నారు.

‘అదేవిధంగా, బండ్ల గణేష్ స్పందించిన తీరు కూడా అంత ఆమోదయోగ్యం కాదు. సమాజంలో ఒక మహిళకు ఇవ్వాల్సిన గౌరవం ఆమెకు ఇవ్వాలి. రోజా కూడా తన మాటలను సరిచూసుకోవాల్సిన అవసరముంది. రోజా, బండ్ల గణేష్ ల ప్రవర్తనను నేను ఖండిస్తున్నా. రోజా శాసన సభ్యురాలు కనుక, ఆమెపై ఇంకా ఎక్కువ బాధ్యత ఉందనే విషయాన్ని నమ్ముతాను. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఆశిద్దాం. వాళ్ల మర్యాదలను అతిక్రమించకుండా ఉండాలని కోరుకుందాం. అంతకు మించి మనం చేయగల్గిందేమీ లేదు’ అని మహేష్ కత్తి అన్నారు.

More Telugu News