Cricket: తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లలేపోయిన క్రికెట్, బాలీవుడ్ జంటలివి!

  • టాలీవుడ్ - క్రికెట్ బంధం ఈనాటిది కాదు
  • క్రికెటర్ల వెంటే బాలీవుడ్ హీరోయిన్లు
  • ప్రేమాయణాలు, ఆపై మనస్పర్థలు

విరాట్ కోహ్లీ, అనుష్క... దాదాపు నాలుగైదేళ్ల నుంచి ప్రేమలో ఉన్న జంట. మధ్యలో కొన్ని విభేదాలు వచ్చి దూరం జరిగినప్పటికీ, చివరికి తమ ప్రేమ కథను సుఖాంతం చేసుకుంటూ 11వ తేదీన మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. బాలీవుడ్, క్రికెట్ కు మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. ఎంతో మంది క్రికెటర్లు బాలీవుడ్ తారలతో ప్రేమాయణం సాగించారు. వాటిల్లో పెళ్లి పీటలు ఎక్కింది కొన్ని జంటలే. వారిలోనూ కలకాలం కలిసున్నది అతి కొద్దిమందే. ఈ నేపథ్యంలో తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లలేకపోయిన క్రికెట్ - బాలీవుడ్ జంటల వివరాలను ఒకసారి పరిశీలిస్తే...

జహీర్ ఖాన్ - ఇషా శర్వానీ: పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ఇటీవల సాగరికా ఘట్గేను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. కానీ, ఆయన వికెట్ ను తొలుత పడగొట్టింది మాత్రం ఇషా శర్వానీ. 2005లో మొదలైన వీరి ప్రేమ ఎనిమిదేళ్లు సాగి, 2013లో ముక్కలైంది.

సౌరవ్ గంగూలీ - నగ్మా: బెంగాల్ టైగర్ గా, భారత క్రికెట్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన సౌరవ్ గంగూలీ భార్య డోనా గంగూలీ అన్న సంగతి తెలిసిందే. కానీ, తన కెరీర్ ప్రారంభంలో... అంటే 1999 సమయంలో అప్పటి టాప్ హీరోయిన్ నగ్మాతో గంగూలీ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాడు. లండన్ లో వరల్డ్ కప్ ఆడే సమయంలో వీరిద్దరూ కలిసి తిరుగుతూ కనిపించడం అప్పట్లో పెను షాకింగ్ న్యూస్. ఆపై ఇద్దరూ కలిసి అరుణాచల్ ప్రదే్శ్ లోని ఓ గుడిలో కనిపించడంతో పెళ్లి కూడా అయిందని అనుకున్నారు. కానీ, దాన్ని వీరు ఇద్దరూ ఖండించారు.

కపిల్ దేవ్ - సారిక: 1980 దశకంలో అత్యంత సంచలనం కలిగించిన వార్తల్లో కపిల్, సారికల సంబంధం ఒకటి. వీరిద్దరూ కలిసి ఎన్నో వివాదాల్లో నిలిచారు. చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఆపై కపిల్ దేవ్, రోమీ భాటియాను వివాహం చేసుకోగా, సారిక దక్షిణాది విలక్షణ నటుడు కమల్ హాసన్ ను వివాహం చేసుకుంది.

రవిశాస్త్రి - అమృతాసింగ్: అదే 80వ దశకంలో ఎక్కువమంది చర్చించుకున్న జంటల్లో రవిశాస్త్రి, అమృతాసింగ్ లు కూడా ఉన్నారు. అప్పట్లో రవి ఆడిన అన్ని మ్యాచ్ ల స్టేడియాల్లో అమృత కనిపించేది. ఆ తరువాత వీరిద్దరి మధ్యా ఏం జరిగిందో ఏమో గానీ, సైఫ్ అలీ ఖాన్ ను అమృత పెళ్లి చేసుకుంది. రవిశాస్త్రి, రితూ సింగ్ మెడలో తాళికట్టాడు. ఇద్దరి వివాహ బంధమూ ఆపై విడిపోయిన సంగతి వేరే విషయం.

యువరాజ్ సింగ్ - కిమ్ శర్మ: యువీ క్రికెటర్ గా కెరీర్ ను ప్రారంభించిన తరువాత కేవలం నాలుగేళ్ల సమయంలో ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి. వాటిల్లో పబ్స్, పార్టీల్లో కిమ్ తో ఎఫైర్ ఒకటి. సుదీర్ఘకాలం పాటు కిమ్- యువరాజ్ మధ్య బంధం నడిచింది. వీరిద్దరి ప్రేమ బంధానికి యువీ కుటుంబీకుల నుంచి అంగీకారం కూడా వచ్చింది. కానీ, వారి ప్రేమబంధం పుటుక్కున తెగిపోగా, యువరాజ్ హేజల్ కీచ్ ను గత సంవత్సరం పెళ్లి చేసుకున్నాడు. కిమ్ ఓ వ్యాపారవేత్తను మనువాడింది.

మహేంద్ర సింగ్ ధోనీ - దీపికా పదుకొనే: నేటి తరం యువతకు తెలిసిన లవ్ స్టోరీ ఇది. తన కెరీర్ తొలినాళ్లలో దీపిక, భారత జట్టు క్రికెట్ కెప్టెన్ ధోనీ మధ్య పెద్ద ప్రేమాయణమే నడిచింది. తమ తమ స్నేహితుల సహకారంతో పరిచయం పెంచుకున్న వీరు కలిసి ఎన్నో పార్టీల్లో తిరిగారు. చెన్నై తరఫున టీ-20 మ్యాచ్ లు ఆడుతున్న ధోనీ వెంట దీపికను తీసుకురావడం పదేళ్ల క్రితం వార్తల్లో నిలిచింది. ఆపై దీపికా పదుకొనే, యువరాజ్ తో కనిపించడంతో ధోనీయే ఆమెను దూరం పెట్టాడని వార్త.

మహేంద్ర సింగ్ ధోనీ - రాయ్ లక్ష్మీ: దీపికా పదుకొనేకు దూరమైన తరువాత ధోనీ హాట్ బ్యూటీగా చిత్రసీమలో పేరు తెచ్చుకున్న రాయ్ లక్ష్మీతో కలిసి కనిపించాడు. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా రాయ్ లక్ష్మిని నియమించుకోవడం వెనుక ధోనీ పాత్ర ఉందని కూడా వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్యా ప్రేమాయణం రెండేళ్లు సాగింది. ఆపై వీరు విడిపోయారు. ధోనీ, సాక్షిని వివాహమాడాడు.

More Telugu News