hyderabad metro rail: హైదరాబాద్ మెట్రోతో చేతులు కలిపిన ఓలా!

  • మెట్రో యాప్ 'టీసవారి'తో ఓలా అనుసంధానం
  • ఓలా వ్యాలెట్ ద్వారా స్మార్ట్ కార్డ్ రీచార్జ్, క్యాబ్ ల బుకింగ్స్
  • స్టేషన్లలో ఓలా కియోస్క్ లు

హైదరాబాద్ మెట్రో రైలు నగరవాసుల అభిమానాన్ని చూరగొంది. మెట్రో రైల్లో ప్రయాణించడానికి నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థతో ఓలా క్యాబ్స్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు చెందిన 'టీసవారి' (TSavaari) యాప్ తో ఓలా అనుసంధానం అయింది.

ఈ క్రమంలో, మెట్రో యాప్ లో ఓలా మనీతో పాటు ఓలా సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులు తమ మెట్రో స్మార్ట్ కార్డులను ఓలా మనీ వ్యాలెట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు టీసవారి యాప్ నుంచి ఓలా క్యాబ్, ఓలా ఆటోలను డైరెక్ట్ గా బుక్ చేసుకోవచ్చు. ఒప్పందంలో భాగంగా మెట్రో స్టేషన్లలోని ఓలా కియోస్క్ ల వద్ద ఆ సంస్థ ప్రతినిధులు వుంటారు. ఓలా క్యాబ్ లను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులకు వీరు సహకరిస్తారు. క్యాబ్ ను బుక్ చేసుకున్న రెండు నిమిషాల్లోనే క్యాబ్ వచ్చేలా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సీఈవో అనిల్ కుమార్ శైనీ మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రోకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని... ఒక రోజు ఏకంగా 2.40 లక్షల మంది ప్రయాణించారని చెప్పారు. ఓలాతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని, ఈ సదుపాయం వల్ల ప్రయాణికులకు స్టేషన్ కు రావడానికి, ఇక్కడ నుంచి వెళ్లడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు.  ఓలా అలయెన్సెస్ డైరెక్టర్ సౌరభ్ మిశ్రా మాట్లాడుతూ, మోట్రో రైలు ప్రయాణికులకు సేవలు అందించడం సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు.
 

More Telugu News