NASA: మరో నివాస గ్రహమా? గ్రహాంతరవాసులా?... రేపు నాసా చెప్పే రహస్యమేంటి?

  • భూమిని పోలిన మరో గ్రహాన్ని నాసా కనుగొందని ఊహ
  • అక్కడ గ్రహాంతర జీవులు ఉన్నాయని అంచనా?
  • రేపు కీలక ప్రకటన చేస్తామని వెల్లడి
  • నాసా ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా అంతులేని ఆసక్తి

గురువారం నాడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఓ గొప్ప విషయాన్ని వెలుగులోకి తేనున్నాము... ఇది నాసా చేసిన ప్రకటన. ఇక నాసా ఏ విషయం గురించి రేపు తెలియజేస్తుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. కెప్లర్ టెలిస్కోప్ సాయంతో, అంతరిక్షం ఆవలి ప్రాంతాలను పరిశీలిస్తున్న నాసా ఏం చెబుతున్నది రేపటి వరకూ సస్పెన్సే అయినా, ఎవరి ఊహలు వారివి. భూమిని పోలిన ఉపగ్రహాన్ని నాసా కనుగొందని, దానిని గురించి వివరాలు వెల్లడించనుందని కొందరు, గ్రహాంతర వాసులను నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారని మరికొందరు, ఓ గ్రహ శకలం భూమిని ఢీకొట్ట బోనున్నదని, ఆ వివరాలను నాసా వెల్లడిస్తుందని ఇంకొందరు... ఇలా ఎవరికి తోచిన ఊహాగానాలను వారు చేసుకుంటున్నారు.

అసలు ఈ విశ్వాంతరాళంలో ఎక్కడో ఒకచోట భూమిని పోలిన గ్రహం ఉంటుందని, అక్కడ జీవి మనుగడకు అవసరమైన వాతావరణం ఉండే ఉంటుందన్నది ప్రతి ఒక్కరూ నమ్మేదే. అయితే, ఆ గ్రహం ఎక్కడుందన్న ప్రశ్నకే ఇంతవరకూ సమాధానం దొరకలేదు. ఇక 2009లో ప్రయోగించిన కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్, ఒక్కో నక్షత్రాన్నీ నిశితంగా పరిశీలిస్తూ, సాగుతోంది. ఒక్కో నక్షత్రం చుట్టూ, భూమిలాంటి గ్రహాలను కనుగొంటూ, 2500 గ్రహాలను గుర్తించింది కూడా. వీటిపై సాగుతున్న అధ్యయనంలో నాసా ఓ కీలకాంశాన్ని గుర్తించిందని, దాని గురించి గురువారం ప్రకటిస్తుందని అత్యధికులు భావిస్తున్నారు.

ఇక రేపటి మీడియా సమావేశంలో పాల్గొనే వారి పేర్లను విశ్లేషిస్తున్న వారు, మానవాళి జీవనానికి ఉపయోగపడే గ్రహం గురించిన సమాచారమే నాసా మీడియా మీట్ లో వెల్లడవుతుందని అంచనా వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే, కెప్లర్ ప్రాజెక్టులోని కీలక శాస్త్రవేత్త జెస్సీ డాట్సన్ మీడియా సమావేశంలో పాల్గొంటారు కాబట్టి. ఆయన చాలాకాలంగా గ్రహ శకలాల మీద పరిశోధనలు సాగిస్తున్నారు కూడా. అదే సమయంలో ఏదైనా గ్రహ శకలం భూమి వైపు వచ్చి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందన్న వార్త చెబుతారా? అన్న అనుమానమూ లేకపోలేదు.

More Telugu News