India: ఇక మన బంధం తెగుతుంది: భారత్ కు చైనా వార్నింగ్

  • డోక్లాం వివాదంతో స్నేహబంధానికి ఎసరు
  • ట్రై జంక్షన్ మాదే
  • ఓ ప్రకటనలో చైనా విదేశాంగ శాఖ
  • రెచ్చగొట్టే చర్యలు వద్దన్న భారత్

మూడు దేశాల ట్రై జంక్షన్ డోక్లాంలో నెలకొన్న వివాదం భారత్, చైనాల మధ్య ఉన్న బంధాన్ని తెంచుతోందని చైనా వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ద్వైపాక్షిక బంధాలను దెబ్బతీసేంతగా డోక్లాం మారిపోయిందని, భారత్ దుందుడుకు వైఖరే ఇందుకు కారణమని, ఆ ప్రాంతం చైనాదేనని చెప్పేందుకు ఎటువంటి సందేహాలూ లేవని వాదించింది.

తాజాగా ఇండియాలో పర్యటించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి రష్యా - ఇండియా - చైనా విదేశాంగ శాఖ స్థాయి సమావేశంలో పాల్గొన్న వేళ, సుష్మా స్వరాజ్ తో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సంవత్సరం జూన్ నుంచి దాదాపు 73 రోజుల పాటు డోక్లాం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆపై రెండు దేశాలూ వెనక్కు సర్దుకోగా, తాజాగా చైనా సైనిక దళాలు మరోసారి డోక్లాంలో మకాం వేశాయి. దాదాపు 1800 మంది సైన్యం ఆ ప్రాంతానికి వచ్చి, హెలిపాడ్లు నిర్మించి, మరోసారి రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం చైనా దౌత్యాధికారికి హెచ్చరికలు కూడా పంపింది. సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెబుతూనే, ఈ తరహా రెచ్చగొట్టే చర్యలు ఏంటని భారత్ ప్రశ్నిస్తోంది.

More Telugu News