Anushka Sharma: అనుష్క శర్మ 'పెళ్లి లెహంగా' గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ!

  • లెహంగా కోసం 67 మంది కళాకారులు.. 32 రోజులు శ్రమించి వైనం
  • పేల్ లెహంగాపై వింటేజ్ ఇంగ్లిష్ రంగుల్లో ఎంబ్రాయిడరీ
  •  ధర గురించి వెల్లడించని సవ్యసాచి

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ-బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మల వివాహం అయిపోయింది. ఇక మిగిలింది రిసెప్షనే. ఈనెల 21న ఢిల్లీలో బంధుమిత్రులకు, 26న ముంబైలో క్రికెటర్లు, బాలీవుడ్ నటులు, వీఐపీలకు విందు ఇచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు కూడా వెళ్లిపోయాయి.

‘విరుష్క’ పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి బోల్డన్ని విశేషాలు బయటకు వస్తున్నాయి. ఎంగేజ్‌మెంట్ రింగ్ నుంచి పెళ్లిలో వడ్డించిన ఆహార పదార్థాల వరకు నిమిషానికో వార్త బయటకు వస్తోంది. అయితే తాజాగా పెళ్లిలో అనుష్క ధరించిన లెహంగాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ‘ఇన్‌స్టాగ్రామ్’లో పోస్టు చేశారు.

అనుష్క ధరించిన లెహంగాను 67 మంది కళాకారులు 32 రోజులపాటు శ్రమించి రూపొందించినట్టు ఆయన వివరించారు. పేల్ పింక్ రంగు లెహంగాపై వింటేజ్ ఇంగ్లిష్ రంగులతో సిల్వర్-గోల్డ్ మెటల్ దారాన్ని ఉపయోగించి ఎంబ్రాయిడరీ చేసినట్టు తెలిపారు. ఇందులో ముత్యాలు, పూసలు గుచ్చినట్టు పేర్కొన్నారు. ఆమె ధరించిన ఆభరణాల్లో సిండికేట్ అన్‌కట్ వజ్రాలను ఉపయోగించినట్టు తెలిపారు. అలాగే విరాట్ ధరించిన ఐవరీ రా సిల్క్ షేర్వాణీపై వింటేజ్ బనారసీ ప్యాటర్న్‌ను చేతితో ఎంబ్రాయిడరీ చేసినట్టు సవ్యసాచి ముఖర్జీ తెలిపారు.

More Telugu News