ACB: దేవాదాయ శాఖలో మరో భారీ తిమింగలం.. ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ ఆస్తులు చూసి విస్తుపోయిన అధికారులు!

  • తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 16 చోట్ల దాడులు
  • ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన అధికారులు
  • అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన వైనం
  • అతడిని విచారించాలంటూ ఇప్పటికే ఏడుసార్లు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం

అవినీతి నిరోధక శాఖకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ) చంద్రశేఖర్ ఆజాద్ ఆస్తులపై తెలుగు రాష్ట్రాల్లోని 16 చోట్ల ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. అతని ఆస్తుల చిట్టా చూసి అధికారులే నోరెళ్లబెట్టారు. రాజమండ్రిలో ఆయన నివసిస్తున్న ఇల్లు, కార్యాలయంతో పాటు విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, నూజివీడు, అనంతపురం జిల్లా నల్లచెరువు తదితర ప్రాంతాల్లో ఆజాద్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల నివాసాల్లో సోదాలు జరిగాయి.

ఏసీబీ సోదాల్లో ఆజాద్ సోదరుడు వివేకానంద పేరిట రూ.55 కోట్ల ఆస్తులు ఉన్నట్టు బయటపడగా, ఆజాద్ తన బినామీల పేరిట ఏకంగా రూ.150 కోట్ల వరకు పోగేశారు.
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఆర్జేసీ హోదాలో ఉన్న ఆయన 2000వ సంవత్సరంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరుతూనే ఆ శాఖలోని భూములపై పట్టు సాధించారు. సోదరుడు వివేకానందను బినామీగా మార్చుకుని 2008లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. రాష్ట్ర విభజన తర్వాత ‘రియల్’ రంగం కుదేలైనా ఆజాద్ ఆస్తులు మాత్రం గణనీయంగా పెరిగాయి.

విజయవాడలో అభేద్య సోలార్ పవర్ ప్రాజెక్టు లిమిటెడ్‌ను ప్రారంభించిన ఆజాద్ తన సోదరుడి వద్ద పనిచేస్తున్న కారు డ్రైవర్‌, దినసరి కూలీలను బినామీలుగా మార్చుకున్నారు. వారి పేర్లపై కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. కాగా, ఆజాద్‌పై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై విచారణ జరపాలంటూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు జీవోలు జారిచేసిందంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. దేవాదాయ శాఖకు చెందిన విజయరాజ్ ఇటీవల ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో ఆజాద్ కొంత అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. నగదు, ఆస్తిపాస్తులు తన  పేరుపై లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఏసీబీ దాడుల్లో ఇప్పటి వరకు రూ.10 లక్షలకుపైగా విలువైన గృహోపకరణాలు, రూ. 5 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.7.25 లక్షల డిపాజిట్లు గుర్తించారు. విజయవాడ గుణదలలో ఓ భారీ భవంతి, గొల్లపూడిలో మూడంతస్తుల బిల్డింగ్‌ నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాద్ గడ్డి అన్నారంలోని నూటన్స్ అపార్ట్‌మెంట్‌లో ఆయన పేరుపై త్రిబుల్ బెడ్‌రూం ఫ్లాట్ ఉంది. అక్కడే నివసిస్తున్న ఆయన భార్య వద్ద 1100 గ్రాముల బంగారు నగలున్నాయి. దాడులు కొనసాగుతుండడంతో మరిన్నిఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

More Telugu News