technicians: వ‌ర్క‌ర్లు, టెక్నీషియ‌న్ల‌కు ప‌ని క‌ల్పించే యాప్‌... ఆవిష్క‌రించిన తెలంగాణ ప్ర‌భుత్వం

  • అర్బ‌న్ జీనీ పేరుతో ఆండ్రాయిడ్ యాప్‌
  • ఒక్క క్లిక్‌తో అన్ని ర‌కాల సౌక‌ర్యాలు
  • ఇంటివ‌ద్ద‌కే వ‌చ్చి సేవ‌లందించ‌నున్న టెక్నీషియ‌న్లు

శిక్ష‌ణ పొందిన టెక్నీషియ‌న్లకు ప‌ని క‌ల్పించ‌డం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఓ యాప్‌ను రూపొందించింది. అర్బ‌న్ జీనీ పేరుతో ఈ ఆండ్రాయిడ్ యాప్‌ను మిష‌న్ ఫ‌ర్ ఎలిమినేష‌న్ ఆఫ్ పావ‌ర్టీ ఇన్ మున్సిప‌ల్ ఏరియాస్ (మెప్మా) రూపొందించింది. హైద‌రాబాద్ మిన‌హా 73 మున్సిప‌ల్ సిటీలు, టౌన్ల‌లో ఈ యాప్ ప‌నిచేయ‌నుంది.

దీని ద్వారా శిక్ష‌ణ పొందిన ఎల‌క్ట్రీషియ‌న్లు, ప్లంబ‌ర్లు, ఫిట్ట‌ర్లు, కార్పెంట‌ర్లు, పెయింట‌ర్లు, ఇంటీరియ‌ర్ డెక‌రేట‌ర్లు, క్లీన‌ర్లు, డ్రైవ‌ర్లు, వంట‌వాళ్లు, ఇత‌ర ప‌ని వాళ్లకు ప‌ని దొర‌క‌నుంది. వీరి సేవ‌లు వినియోగించుకోవాల‌నుకున్న వారు యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఒక్క క్లిక్‌తో కావాల్సిన ప‌నిని కేటాయించవ‌చ్చు. వారు ఇంటివ‌ద్ద‌కే వ‌చ్చి సేవ‌లు అందిస్తారు. గ‌త మూడేళ్లుగా తాము శిక్ష‌ణ‌నిచ్చిన టెక్నీషియ‌న్లంద‌రికీ ఈ యాప్ ద్వారా ప‌నిక‌ల్పించ‌నున్న‌ట్లు మెప్మా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎల్‌. వంద‌న కుమార్ తెలిపారు.

హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న కార‌ణంగా ఈ యాప్ సేవ‌ల‌ను మిగ‌తా అర్బ‌న్ ప్రాంతాల్లో మాత్ర‌మే అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ యాప్ ద్వారా వినియోగ‌దారుల‌ను, టెక్నీషియ‌న్ల‌ను స‌మ‌న్వ‌యం చేయడానికి ప్ర‌తి అర్బ‌న్ కేంద్రంలో సిటీ లైవ్లీహుడ్ సెంట‌ర్ (సీఎల్‌సీ)ని ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. మెప్మా వ‌ద్ద శిక్ష‌ణ పొందిన వారు మాత్ర‌మే కాకుండా మిగ‌తా నైపుణ్యాలు గ‌ల వారు కూడా ఇందులో పేరు రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు.

More Telugu News