డొనాల్డ్ ట్రంప్: చంద్రుడిపై అమెరికా జెండానే కాదు.. అమెరికన్ పాదాల గుర్తులూ ఉండాలి: డొనాల్డ్ ట్రంప్

  • ‘న్యూ స్పేస్ పాలసీ డైరెక్టివ్’పై సంతకం చేసిన ట్రంప్
  • చంద్రుడి పైకి వెళ్లిన ఆఖరి వ్యక్తి హారిసన్ కాకూడదు
  • వైట్ హౌస్ లో ట్రంప్

వ్యోమగాములను మరోమారు చంద్రుడిపైకి పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ‘చంద్రుడిపైన ఈసారి అమెరికా జెండానే కాదు..అమెరికన్ పాదాల గుర్తులు కూడా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ లో ‘న్యూ స్పేస్ పాలసీ డైరెక్టివ్’పై సంతకం చేస్తున్న సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భవిష్యత్ లో అంగారక గ్రహం (మార్స్)పైకి మనుషులను పంపే యోచనలో నాసా ఉందని, ఈలోగా చంద్రుడి పైకి మరోసారి అమెరికన్లను పంపితే ఆ ప్రయోగానికి ఇది ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

మార్స్ మిషన్ కు సంబంధించి ఓ ఫౌండేషన్ ను ప్రారంభిస్తామని తెలిపారు. స్పేస్ పాలసీపై ట్రంప్ సంతకం చేస్తున్న సందర్భంలో ఆయనతో పాటు నాసా మాజీ వ్యోమగామి హారిసన్ ష్మిట్ కూడా ఉన్నారు. చంద్రుడి పైకి వెళ్లిన ఆఖరి వ్యక్తి హారిసన్ కాకూడదని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. చంద్రుడి పైకి వ్యోమగాములను పంపే నిమిత్తం ప్రైవేట్ రంగాలతో ఒప్పందం కుదుర్చుకునే ఉన్నట్టు వైట్ హౌస్ సమాచారం.

కాగా, 2005 నుంచి 2009లో జరిగిన కాన్ స్టిలేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా అమెరికన్లను చంద్రుడిపైకి పంపించాలని నాసాను నాటి అధ్యక్షుడు జార్జిబుష్ కోరారు. 2020 లోగా అమెరికన్లను చంద్రుడిపైకి పంపించాలనుకున్న ఈ ప్రోగ్రామ్ కు సుమారు 100 బిలియన్ డాలర్ల బడ్జెట్ వేశారు. అయితే, అమెరికాకు బరాక్ ఒబామా అధ్యక్షుడైన తర్వాత ఆ ప్రోగ్రామ్ పై ఆసక్తి చూపకపోగా, దానిని రద్దు చేశారు. దీనికి బదులుగా 2030లోగా మార్స్ పైకి అమెరికన్లను పంపే విషయమై దృష్టిపెట్టారు. 

More Telugu News