లక్ష్మీపార్వతి: లక్ష్మీపార్వతి అసలు క్యారెక్టరో ఏంటో ప్రజలకు తెలిసింది!: దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

  • నా సినిమాను ఆమె ఎలా అడ్డుకుంటుంది?
  • కొన్ని లక్షల మందికి ‘లక్ష్మి’ అనే పేరు ఉంటుంది
  • ఓ ఇంటర్వ్యూలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ దర్శకుడు

తన కారణంగా లక్ష్మీపార్వతి అసలు క్యారెక్టరో ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసిందని ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గత నెల 12న ఈ చిత్రాన్ని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రారంభించిన విషయాన్ని, ఆ తర్వాత ఆ ఘాట్ అపవిత్రమైపోయిందంటూ దానిని పాలతో లక్ష్మీపార్వతి శుద్ధిచేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

లక్ష్మీపార్వతి ఓ బజారు వ్యక్తిలా ప్రవర్తిస్తూ, తనను బజారోడని, రౌడీ అని, వెధవ అని, అంతుచూస్తానని హెచ్చరించిందని మండిపడ్డారు. తాను తీసే సినిమాను అడ్డుకుంటానని లక్ష్మీపార్వతి అంటోందని, ఏ రకంగా ఆమె అడ్డుకుంటుంది? అని ప్రశ్నించారు. ఆమె జీవితచరిత్రను రాసి, దానిని ఎక్కడైనా రిజిస్టర్ చేసిందా? అని ప్రశ్నించారు. అలా చేసి వుంటే అదే జీవిత చరిత్రను తాను సినిమాగా తీస్తే అడ్డుకోగల్గుతారు తప్పా, లేకపోతే తనను అడ్డుకునే హక్కు ఆమెకు లేదని అన్నారు.

‘భారతదేశంలో కొన్ని లక్షల మందికి ‘లక్ష్మి’ అనే పేరు ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీపార్వతి జీవితంలో జరిగిన సంఘటనలు లాంటివే  కొన్ని కోట్ల మంది జీవితాల్లో కూడా ఉంటాయి. వయసు పైబడిన వ్యక్తుల జీవితంలో వారికి చేదోడువాదోడుగా ఉండేందుకు భార్యలు అయినటువంటి వారి ఉదాహరణలు కొన్ని వేలు ఉన్నాయి. అవసరమైతే సెన్సార్ కు, కోర్టుకు కూడా ఆ ఉదాహరణలు ఇస్తాను.

నాకో మనసు ఉంది, దమ్ము ఉంది. లక్ష్మీపార్వతి గారూ.. నేను సినిమా తీస్తుంటే నువ్వు ఎందుకు ఉలిక్కిపడటం?, ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. అన్న గారి సతీమణిగా మిమ్మల్ని గౌరవిస్తాం. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడి.. నేనేదో రోడ్ సైడ్ వ్యక్తినని అన్నారు. మీరు ఏ రాజమహల్ నుంచి వచ్చారు? ఇందుకు మీరు సమాధానం చెప్పాలి’ అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

More Telugu News