EMC IN AP: ఈఎంసీకి కేంద్రం ఆమోదం.. ధన్యవాదాలు తెలిపిన లోకేష్!

  • ఈరోజు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
  • ఇక్కడ ఫోన్లను తయారు చేయనున్న కార్బన్, లావా, సెల్ కాన్ కంపెనీలు
  • 113.27 ఎకరాల్లో క్లస్టర్ ఏర్పాటు

ఏపీలో ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రేణిగుంటలో శ్రీవేంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చరింగ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ఆమోదముద్ర వేసింది. గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ గా గుర్తించింది. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది. 113.27 ఎకరాల్లో ఈ క్టస్టర్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్లస్టర్ లో కార్బన్, లావా, సెల్ కాన్ తదితర మొబైల్ కంపెనీలు భాగస్వాములుగా ఉండనున్నాయి. ఇప్పటికే సెల్ కాన్ తన కార్యకలాపాలను ప్రారంభించగా... త్వరలోనే కార్బన్ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది.  

ఈఎంసీ క్లస్టర్ కు ఆమోదం తెలిపిన కేంద్రానికి ఏపీ మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఏపీని హబ్ గా తయారుచేయడమే తమ లక్ష్యమని చెప్పారు. బ్యాటరీతో సహా మొబైల్ కు అవసరమైన ప్రతి విడిభాగం ఏపీలోనే తయారయ్యేలా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అనంతపురం జిల్లాలో కూడా ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 

More Telugu News