ap special status: ప్రత్యేక హోదా కోసం రాజీనామాలకు కూడా సిద్ధమే: వైసీపీ ఎంపీలు

  • మేము రాజీనామా చేస్తే పార్లమెంటులో మాట్లాడేవారు ఎవరూ ఉండరు
  • కేంద్రంతో చంద్రబాబు రాజీ పడ్డారు
  • స్పెషల్ స్టేటస్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాం

ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం తదితర అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తెలిపారు. అనంతపురం జిల్లా కూడేరులో పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు ఈ మేరకు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేత చేయిస్తారో లేక మీరే పూర్తి చేస్తారో తమకు అనవసరమని... ప్రాజెక్టు మాత్రం అనుకున్న సమయానికి పూర్తి కావాలని చెప్పారు.

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, విశాఖకు రైల్వే జోన్ కూడా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయడానికి ఇప్పటికీ తాము సిద్ధమేనని చెప్పారు. తమ రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే... స్పీకర్ ఫార్మాట్ లో ఇప్పటికిప్పుడే రాజీనామాలు చేస్తామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఎంపీల రాజీనామాల అంశాన్ని మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దది చేసి చూపుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నుంచి 9 మంది ఎంపీలు ఎన్నికయ్యారని... వీరిలో ఏపీలో ముగ్గురు, తెలంగాణలో ఒకరు పార్టీ ఫిరాయించారని... వీరి చేత కూడా రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

ఏపీకి చంద్రబాబు చేస్తున్న ద్రోహం అంతాఇంతా కాదని వైసీపీ ఎంపీలు విమర్శించారు. తాను చేసిన తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికే చంద్రబాబు కేంద్రంతో రాజీ చేసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రానికి నిధులు రాకుండా వైసీపీ అడ్డుకుంటోందంటూ చంద్రబాబు చేస్తున్న విమర్శలు కేవలం కుంటి సాకులు మాత్రమేనని అన్నారు. తాము రాజీనామా చేస్తే పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం గళమెత్తేవారే ఉండరని చెప్పారు. పార్లమెంటులో స్పెషల్ స్టేటస్ పై చర్చ జరగాలంటే తాము సభలో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. 

More Telugu News