Telugudesam: ప్రాణాలు పోయినా కాపులను బీసీల్లో కలవనివ్వను: ఆర్ కృష్ణయ్య హెచ్చరిక

  • కాపులను బీసీల్లో చేరనివ్వబోము
  • అగ్ర భాగంలో ఉన్న కాపులను ఎలా బీసీలంటారు?
  • అన్ని కులాల్లోనూ పేదలున్నారు 
  • ఎన్నికల్లో ఓట్ల కోసమే హడావుడి నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించినట్టుగా, కాపులను బీసీల్లో చేర్చాలన్న ఆలోచనను తామంతా గట్టిగా అడ్డుకుంటామని బీసీ సంఘాల నేత, తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఉన్న ఆయన, బీసీలతో పోలిస్తే, అన్ని విధాలుగా అగ్ర భాగంలో ఉన్న కాపులను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బీసీల్లో కలపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ కోటాకు ఇబ్బంది కలుగకుండా కాపులను ఎలా విలీనం చేస్తారన్న తమ ప్రశ్నకు చంద్రబాబు సహా, ఎవరి వద్దా సమాధానం లేదని అన్నారు.

కాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ బడుగుల్లో కలవనిచ్చేది లేదని, అందుకోసం తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి పోరాడతానని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న తమ డిమాండ్లను నెరవేర్చుకు తీరుతామని తెలిపారు. కాపులు సహా, అన్ని కులాల్లోనూ ఆస్తి పాస్తులు లేనివారున్నారని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే, తాము కూడా సహకరిస్తామని తెలిపారు.

అంతే తప్ప, కులాల రాజకీయాలు చేస్తూ, ఎన్నికల్లో ఓట్ల కోసం ఈ తరహా నిర్ణయాలను తీసుకుంటే, కాపుల్లో కూడా ఏపీ ప్రభుత్వం చులకనవుతుందని కృష్ణయ్య అన్నారు. మంజునాథ కమిటీ రిపోర్టు ఇవ్వకుండానే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుని చంద్రబాబు ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News