Reliance: జియో ఘనత.. వచ్చే ఏడాది పూర్తి 4జీ దేశంగా మారనున్న భారత్.. వెల్లడించిన సర్వే

  • వచ్చే ఏడాదీ కొనసాగనున్న జియో దూకుడు
  • టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉందన్న సర్వే
  • దేశం మొత్తం 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయన్న లండన్ సంస్థ

గతేడాది టెలికం రంగంలోకి ప్రవేశించిన రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఏడాదిపాటు ఉచితంగా 4జీ సేవలు అందిస్తూ వినియోగదారులను తనవైపుకు లాగేసుకుంది. దీంతో మిగతా ఆపరేటర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. జియోతో పోటీ పడేందుకు టారిఫ్‌లను భారీగా తగ్గించాల్సి వచ్చింది. కాగా, 2018 నాటికి భారత్ పూర్తిగా 4జీ దేశంగా అవతరించనుందని లండన్‌కు చెందిన ‘ఓపెన్ సిగ్నల్’ అనే సంస్థ తెలిపింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వైర్‌లెస్ కవరేజ్‌ను మ్యాపింగ్ చేస్తుంటుంది.

జియో రంగ ప్రవేశంతో టెలికం మార్కెట్లో ధరల యుద్ధం మొదలైందని, ఖాతాదారులను నిలుపుకునేందుకు చవగ్గా ఎల్టీఈ సేవలను అందించడం మొదలుపెట్టాయని ‘ఓపెన్ సిగ్నల్’ తన నివేదకలో పేర్కొంది. ఇదే ట్రెండ్ వచ్చే ఏడాదీ కొనసాగుతుందని, 4జీ ఖాతాదారుల వృద్ధిలో జియోనే మళ్లీ ఆధిపత్యం కనబరుస్తుందని పేర్కొంది. అయితే వచ్చే ఏడాది జియో తన రేట్లను పెంచే అవకాశం ఉందని పేర్కొంది. అదే జరిగితే ప్రస్తుతం టారిఫ్ రేట్ల విషయంలో వివిధ ఆపరేటర్ల మధ్య ఉన్న తేడాలు చెరిగిపోతాయని అంచనా వేసింది.

ఏడాది క్రితం 4జీ రంగంలో అడుగుపెట్టిన జియో తొలుత ఉచితంగా సేవలను అందించింది. తర్వాత రాయితీలపై డేటా అందిస్తూ వస్తోంది. ఇతర టెలికం కంపెనీలతో పోలిస్తే ఇప్పటికీ జియోనే చవగ్గా  సేవలు అందిస్తోంది. దీంతో అనతికాలంలోనే జియో వినియోగదారులు ఇబ్బడిముబ్బడిగా పెరిగారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియోకు పదికోట్ల మందికిపైగా ఖాతాదారులున్నారు.

జియో నుంచి పోటీని తట్టుకునేందుకు ఆపరేటర్లందరూ 4జీ ఎల్టీఈ వైపు పరుగులు తీస్తుండడంతో వచ్చే ఏడాదికి భారత్ పూర్తిగా 4జీ దేశంగా మారుతుందని ‘ఓపెన్ సిగ్నల్’ తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి దేశవ్యాప్తంగా 4.2 మిలియన్ టెరాబైట్ల డేటా వినియోగం జరగ్గా అందులో 3.9 మిలియన్లు 4జీ డేటాయేనని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి.

More Telugu News