Nagar Kurnool: భర్తను హత్య చేసి.. ప్రియుడినే భర్తగా నమ్మించాలనుకున్న స్వాతి... రియల్ క్రైమ్ థ్రిల్లర్!

  • భర్తను దారుణంగా హత్య చేసి ఆ స్థానంలో ప్రియుడిని చూపిన స్వాతి
  • తొలుత నమ్మిన పోలీసులు, న్యాయమూర్తి
  • గొంతు గుర్తు పట్టిన బంధువులు. తమదైన శైలిలో విచారించిన పోలీసులు
  • బట్టబయలైన స్వాతి బండారం

ఇదో నిజమైన క్రైమ్ థ్రిల్లర్. భర్తను దారుణంగా హత్య చేసి, అతని స్థానంలో ప్రియుడిని తెచ్చుకుని, నలుగురి ముందూ భర్తగా నిలపాలని ఓ భార్య పన్నిన పన్నాగం. భర్తపై యాసిడ్ దాడి జరిగిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులను నమ్మించి, న్యాయమూర్తి ముందు తలకు బ్యాండేజీ వేసివున్న ప్రియుడితో స్టేట్ మెంట్ ఇప్పించి, కొంత మేరకు విజయం సాధించిన ఆ భార్య బండారం, చివరికి పోలీసుల విచారణలో బట్టబయలయింది. గత వారం నాగర్ కర్నూలులో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి వెనుకున్న అసలు నిజమిది.

మరిన్ని వివరాల్లోకి వెళితే,  ఎనిమిదేళ్ల క్రితం సుధాకర్ రెడ్డికి, స్వాతికి ప్రేమ వివాహం జరుగగా, వీరికి ఇద్దరు పిల్లలు. చిన్న ఉద్యోగం చేస్తూ, ఆపై కాంట్రాక్టర్ స్థాయికి ఎదిగిన సుధాకర్ స్థితిమంతుడే. నాగర్ కర్నూలులోనే ఓ ఫిజియో థెరపీ సెంటర్ కు వెళ్లిన సమయంలో స్వాతికి రాజేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర బంధంగా మారి, వారిద్దరూ ఒకరిని ఒకరు విడిచి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సుధాకర్ కు సైతం స్వాతి ప్రవర్తనపై అనుమానం వస్తుండటంతో గొడవలు కూడా జరిగాయి.

ఈ క్రమంలో గత నెల 26వ తేదీ రాత్రి సుధాకర్ తలకు గాయం కాగా, ఆసుపత్రిలో కుట్లు వేయించుకున్నాడు. అప్పుడే స్వాతిలోని మరో కోణం బయటకు వచ్చింది. రాజేష్ తో కలసి, బెడ్ పై ఉన్న సుధాకర్ ను దారుణంగా హత్య చేసింది. ఆపై మృతదేహాన్ని మహబూబ్ నగర్ జిల్లా అడవుల్లోకి తీసుకెళ్లి ఇద్దరూ కలిసి దహనం చేశారు. ఆ తర్వాత కొత్త నాటకానికి తెరదీశారు. అందులో భాగంగా, రాజేష్ తన ముఖానికి కొన్ని క్రీములు రాసుకోవడంతో చర్మమంతా కాలిపోయింది. దీంతో తన భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారని నాటకమాడిన స్వాతి, చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రియుడిని చేర్చింది. అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని బంధువులకు చెప్పి, ఆరున్నర లక్షల రూపాయల బిల్లు కూడా కట్టించింది. పోలీసులు సైతం తొలుత సాధారణ కేసుగానే రిజిస్టర్ చేసి, దర్యాఫ్తు చేస్తున్న వేళ, స్వాతి, రాజేష్ ల మధ్య ఉన్న బంధం గురించి తెలిసింది.

రాజేష్ పది రోజులుగా కనిపించడం లేదని తెలుసుకున్న పోలీసులు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తమదైన శైలిలో దర్యాఫ్తు ప్రారంభించారు. ఆసుపత్రిలో సుధాకర్ గా నటిస్తున్న రాజేష్ గొంతును గుర్తుపట్టిన బంధువులు, అతను సుధాకర్ కాదని చెప్పడంతో, పోలీసులు స్వాతిని తమదైన శైలిలో విచారించగా విషయం బయటకు వచ్చింది. మృతదేహాన్ని దహనం చేసిన చోటుకు స్వాతిని తీసుకెళ్లి, అవశేషాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, స్వాతి, రాజేష్ పై కేసు నమోదు చేశారు. ఆ విధంగా స్వాతి వేసిన మాస్టర్ ప్లాన్ విఫలమై, కటకటాల్లోకి వెళ్లేలా చేసింది.

More Telugu News