కేటీఆర్: 'గేమర్ కనెక్ట్' ప్రదర్శనను ప్రారంభించిన కేటీఆర్.. వీడియో గేమ్స్ ఆడి ఉత్సాహపరిచిన మంత్రి!

  • రాబోయే రోజుల్లో గేమింగ్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్
  • వీడియో గేమ్స్, మల్టీ మీడియా రంగానికి పెద్దపీట  
  • ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులతో ముందుకు రావాలి: కేటీఆర్

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో గేమర్ కనెక్ట్ ప్రదర్శనను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎన్ వీడియో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వీడియో గేమ్ లను ఆడిన కేటీఆర్, అక్కడ ఉన్న వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, వీడియో గేమ్స్, మల్టీ మీడియా రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించామని చెప్పారు.

 ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులతో ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు. కంప్యూటర్ గేమ్స్, యానిమేషన్ రంగం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సుమారు 240 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందని అన్నారు. ఈ వ్యాపారం మన దేశంలో కేవలం 2 బిలియన్ డాలర్లలోపే ఉందని, కంప్యూటర్ గేమ్స్, యానిమేషన్ రంగాన్ని అభివృద్ధి చేస్తే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. రాబోయే రోజుల్లో గేమింగ్ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్ ఉందని, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, మల్టీమీడియా రంగాల అభివృద్ధికి ఇమేజ్ టవర్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో గేమింగ్ షో ను ప్రతి ఏటా నిర్వహించాలని కోరుతున్నామని కేటీఆర్ అన్నారు. కాగా, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభించిన గేమర్ కనెక్ట్ షో రెండు రోజుల పాటు జరగనుంది. ఈ షోలో 24 గేమింగ్ కంపెనీలు పాల్గొన్నాయి. 

More Telugu News