taman: 'సైరా'కి పనిచేసే ఛాన్స్ తమన్ కి లేనట్టే!

  • 'సైరా' పై ఆశలు పెట్టుకున్న తమన్ 
  • మరో సినిమా ఇస్తానని చెప్పిన చరణ్ 
  • త్వరలోనే సంగీత దర్శకుడి విషయంలో క్లారిటీ 

'సైరా' సినిమా కోసం భారీ తారాగణం ఎంపిక జరిగింది .. అలాగే ప్రముఖ టెక్నీషియన్స్ ను తీసుకున్నారు. జాతీయస్థాయిలో ఈ సినిమాను రూపొందించి .. అదే స్థాయిలో విడుదల చేయనున్నారు. అందువలన ప్రతి విషయంలోను ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహ్మాన్ ను అనుకున్నారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్టును తాను చేయలేకపోతున్నట్టుగా ఆయన ఇటీవల చెప్పారు.

ఈ నేపథ్యంలో తమన్ కే ఆ బాధ్యతను అప్పగిస్తారనే టాక్ వచ్చింది .. ఆయన కూడా ఈ ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్నాడు. అయితే తమన్ కి ఛాన్స్ దక్కకపోవచ్చనేది తాజా సమాచారం. తన తదుపరి సినిమా ఛాన్స్ ఆయనకి ఇస్తానని చెప్పిన చరణ్, 'సైరా' కోసం ఇతర సంగీత దర్శకుల ఎంపికపైనే దృష్టి పెట్టాడట. ఈ క్రమంలో కీరవాణి పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. 'బాహుబలి' వంటి భారీ సినిమాలకి పనిచేసి మెప్పించిన కీరవాణిని తీసుకునే అవకాశం లేకపోలేదని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!

More Telugu News