Pawan Kalyan: నేను చిరంజీవి అంతటి మంచి వాడిని కాదు.. జాగ్ర‌త్త‌!: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెర‌వేర్చాలి
  • నెర‌వేర్చ‌క‌పోతే నేను ప్ర‌జ‌ల త‌ర‌ఫున వ‌చ్చి పోరాడ‌తాను
  • చిరంజీవి గారికి చాలా స‌హ‌నం ఉంది, పడ‌తారు
  • కానీ నేను అలా కాదు

'భార‌త దేశం చాలా గొప్ప‌దేశం.. అనేకమంది మ‌హాత్ములు పుట్టిన దేశం. ప్ర‌త్యేక‌ తెలంగాణ‌, ఆంధ్రలాంటి ఉద్య‌మాలు ఆఫ్రికాలాంటి దేశాల్లో జ‌రిగి ఉంటే త‌ల‌కాయ‌లు న‌రికేసుకునేవారు. మ‌న‌వ‌ద్ద అలాంటి ఘ‌ట‌న‌లు ఎందుకు జ‌ర‌గ‌లేదంటే, అది మ‌న దేశం తాలూకు ధ‌ర్మం, శ‌క్తి, స‌త్య‌మే కార‌ణాలు. అదీ దేశం తాలూకు ఔన్న‌త్యం, గొప్ప‌ద‌నం, అంత గొప్ప‌ది ఈ దేశం. మ‌న దేశంలో వ్య‌వ‌స్థ‌కు తూట్లు పొడ‌వ‌లేరు' అని సినీన‌టుడు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.

రాజ‌మ‌హేంద్ర వ‌రం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... "ఈ విష‌యాలు ఎందుకు చెబుతున్నానంటే... కాపు రిజ‌ర్వేష‌న్లు చేస్తే బీసీలు గొడ‌వ‌ప‌డ‌తారు.. విధ్వంసం జ‌రుగుతుంద‌ని కొంద‌రు అన్నారు. కాపులకి బీసీలు వ్య‌తిరేక‌మ‌ని ఎందుకు అనుకుంటున్నారు. నాపై విమ‌ర్శ‌లు చేసేట‌ప్పుడు కాస్త ఆలోచించండి. ప్ర‌జారాజ్యం పార్టీలాగా, ఆ పార్టీలో చేరిన‌ కొంద‌రు వ్య‌క్తుల్లాగా నేను బ‌ల‌హీన‌మైన వ్య‌క్తిని కాదు.

చిరంజీవి అంత మంచిత‌నం నాలో లేదు. ద‌య‌చేసి మీరంద‌రూ గుర్తు పెట్టుకోండి. చిరంజీవి గారికి చాలా స‌హ‌నం ఉంది, పడ‌తారు. కానీ నేను అలా కాదు. ప్ర‌జ‌ల‌కి మోసం జ‌రుగుతున్న‌ప్పుడు ప‌డే వ్య‌క్తిత్వం నాది కాదు. వ్య‌క్తిగ‌తంగా న‌న్ను దెబ్బ‌కొట్టాల‌ని చూస్తే ఊరుకుంటాను. ప్ర‌జ‌ల కోసం ముందుకు వ‌చ్చిన‌ప్పుడు న‌న్ను దెబ్బ‌కొట్టాల‌ని చూస్తే ఊరుకోను. జ‌న‌సేన‌లోకి వ‌స్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతామనుకుంటే మీరంద‌రూ రావ‌ద్దు.

ప్ర‌జాసేవ‌ కోస‌మ‌యితేనే రండి. పార్టీలో నాకు కొంద‌రు ఎక్కువ‌, త‌క్కువ అని ఉండదు. ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెర‌వేర్చ‌ని నాడు, నేను ప్ర‌జ‌ల త‌ర‌ఫున వ‌చ్చి పోరాడ‌తాను. నేను రెండు మాట‌లు మాట్లాడ‌ను. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ఒకే విధంగా మాట్లాడ‌తాను.." అని స్పష్టం చేశారు.

More Telugu News