Donald Trump: ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలెం గుర్తింపు... సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్!

  • జెరూసలెంకు రావాలని ఎంబసీ ఉద్యోగులకు ఆదేశాలు
  • ట్రంప్ నిర్ణయంపై అరబ్ దేశాల ఆగ్రహం
  • అమెరికాలో రక్తపాతం తప్పదని హెచ్చరించిన ఉగ్రమూకలు 

డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయిల్ రాజధానిగా టెల్ అవీవ్ ను కాదని జెరూసలెంను గుర్తించారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలకు జెరూసలెం పవిత్ర నగరం. బైబిల్ ప్రకారం పాలస్తీనాలో ఏసు క్రీస్తు పుట్టగా, జెరూసలెంలో ఆయన జీవితంలోని కీలక ఘడియలు నడిచాయి. ఈ నేపథ్యంలో ఈ పట్టణం రెండు దేశాలకు అత్యంత పవిత్రమైనది. అంతే కాకుండా జెరూసలెంతో పాటు పాలస్తీనాలోని బెత్లహాంను సందర్శించేందుకు భారీ సంఖ్యలో క్రైస్తవ భక్తులు వెళ్తుంటారు. దీంతో ఈ రెండు ప్రాంతాలు పర్యాటకంగా కూడా కీలకమైనవి.

ఈ నేపథ్యంలో ట్రంప్ జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించారు. దీంతో వెస్ట్ బ్యాంక్ తో పాటు టెల్ అవీవ్ నగరంలో ఉంటున్న అమెరికా రాయబార కార్యాలయ ఉద్యోగులను జెరూసలెంకు మకాం మార్చాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, తమ దేశానికి తూర్పు జెరూసలెంను రాజధానిగా చేసుకోవాలని పాలస్తీనా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన పెనుకలకలం రేపింది. వాస్తవానికి అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి జెరూసలెంకు మార్చాలన్న ప్రతిపాదన 22 ఏళ్లనాటిది. అయితే పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచి, సఖ్యత కుదర్చడానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోకూడదన్న ఉద్దేశంతో, ఈ నిర్ణయాన్ని అమెరికా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది.

 అయితే అధికారంలోకి వస్తే దీనిపై స్పష్టత తీసుకొస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన అల్లుడు, సలహాదారు అయిన జేడ్ కుష్నర్ పై దీని బాధ్యతను ఉంచారు. ఈ క్రమంలో తాజాగా ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలెంను గుర్తించినట్టు ప్రకటించారు. దీనిపై అరబ్బు దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే సౌదీఅరేబియా, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ దేశాలు తొందరపాటు వద్దని ట్రంప్ కు సలహా ఇచ్చాయి. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకపోవడం విశేషం. ప్రముఖ ఉగ్రవాద సంస్థలు అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ లు అమెరికాలో తీవ్ర రక్తపాతం జరుగుతుందని కూడా హెచ్చరించాయి. అయితే ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చేందుకు కనీసం మూడు నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు.

More Telugu News