Sugar: మధుమేహం శాశ్వతమేమీ కాదు... జీవితాంతం మందులు అక్కర్లేదని తేల్చిన శాస్త్రవేత్తలు!

  • శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైన నిజం
  • సమతుల ఆహారం, వ్యాయామం చేస్తే చాలు
  • బరువు తగ్గితే, షుగర్ లెవల్స్ తిరిగి సాధారణ స్థాయికి
  • 'ద లాన్ సెట్' జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం వివరాలు

శరీరానికి మధుమేహం సోకితే... అసలు ఆ ఆలోచనే సగం కుంగదీస్తుంది. ఇక జీవితాంతమూ మందులు వాడుతుండాలన్న ఆలోచన కలుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ రోగులున్న ఇండియాలో దాదాపు ప్రతి ఆరుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా. ఇక చక్కెర వ్యాధి సోకితే జీవితాంతమూ మందులు వాడే అవసరం లేదని న్యూ క్యాజిల్, గ్లౌస్ గౌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.

వర్శిటీల సైంటిస్టులు రాయ్ టేటర్, మైక్ లీన్ లు జరిపిన అధ్యయనం వివరాలు 'ద లాన్ సెట్' జర్నల్ లో ప్రచురితమయ్యాయి. వైద్యుల సూచనలు, సహకారంతో తగిన విధంగా బరువు తగ్గిన మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో సుమారు సగం మంది మందుల వాడకాన్ని నిలిపివేశారని వారు తెలిపారు. తక్కువ కేలరీలు కలిగున్న ఆహారాన్ని తీసుకోవడం, బరువు తగ్గడం ద్వారా 45.6 శాతం మంది రోగులకు మందులు వాడాల్సిన అవసరం తప్పిందని అన్నారు.

బరువు తగ్గితే, కాలేయం, క్లోమ గ్రంథుల్లోని కొవ్వు తగ్గిపోతుందని, ఆపై వాటి పనితీరు సాధారణ స్థితికి చేరడంతోనే మందుల వాడకం తప్పుతుందని వారు అంటున్నారు. 12 నెలల పాటు హెచ్బీఏ 1సీ మోతాదు 6.5 శాతం కన్నా తక్కువగా ఉండి, ఆపై రెండు నెలల పాటు మందులు వాడకున్నా అదే పరిస్థితి కొనసాగితే, షుగర్ వ్యాధి నుంచి బయటపడినట్టేనని వెల్లడించారు. రెండు గ్రూపులుగా రోగులను విభజించి తాము స్టడీ చేశామని, ఒక గ్రూప్ లోని వారికి ఔషధాలు అందించి, మరో గ్రూప్ వారికి సమతుల ఆహారం, వ్యాయామం ద్వారా బరువు తగ్గించగా, ఐదు నెలల తరువాత 57 శాతం మందిలో షుగర్ వ్యాధి కనిపించలేదని సైంటిస్టులు పేర్కొన్నారు.

More Telugu News