vijaya shanthi: మోసం కేసులో విజయశాంతికి ఊరట.. పిటిషన్‌ను కొట్టేసిన మద్రాసు హైకోర్టు

  • విజయశాంతి మోసం చేశారంటూ హైకోర్టును ఆశ్రయించిన హోటల్ యజమాని
  • వ్యక్తిగత కక్షలతో కోర్టును ఆశ్రయించవద్దన్న ధర్మాసనం
  • నటికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు కొట్టివేత

సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతికి కోర్టులో ఊరట లభించింది. విజయశాంతి తనను మోసం చేశారంటూ చెన్నైకి చెందిన ఓ హోటల్ అధినేత ఇందర్ చంద్ జైన్ వేసిన  పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. చెన్నై టీనగర్‌లోని రెండంతస్తుల స్థలాన్ని పవర్ ఏంజెంట్‌గా ఉన్న విజయశాంతి తనకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుని రూ.4.68 కోట్లు తీసుకున్నారని, అయితే ఆ తర్వాత  ఆ స్థలాన్ని వేరే వారికి విక్రయించారని, తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదంటూ ఐదేళ్ల కిందట ఇందర్ చంద్ జైన్ జార్జిటౌన్ కోర్టులో కేసు వేశారు.

విజయశాంతి సహా నలుగురిపై మోసం కేసుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. అయితే సివిల్ వివాదాలకు సంబంధించిన పిటిషన్‌ను స్వీకరించలేమని కోర్టు పేర్కొనడంతో ఆయన మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో ఎగ్మూరులోని కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. ఈ కేసును విచారించాల్సిందిగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌ను కోర్టు ఆదేశించింది. ఇందర్ చంద్ పిటిషన్లపై స్పందించిన విజయశాంతి వాటిని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ రెండు పిటిషన్లను విచారించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. వ్యక్తిగత కక్షలతో పిటిషన్లు దాఖలు చేయకూడదని ఇందర్ చంద్‌పై ఆగ్రహం వ్యక్తి చేసిన కోర్టు సివిల్ కోర్టులోనే పరిహారం కోరి ఉంటే సరిపోయేదని పేర్కొంది. విజయశాంతికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.

More Telugu News