North Korea: అణుదాడిని ఇలా తప్పించుకోండి.. చైనా ఆసక్తికర కథనం!

  • ఉత్తరకొరియా సరిహద్దుల్లో ఉన్న జిలిన్ సిటీ
  • 'జిలిన్ డైలీ'లో కామన్ సెన్స్ పేరిట ప్రత్యేక కథనం
  • అణుదాడి నుంచి తప్పించుకునే మార్గాలు 

గత కొంత కాలంగా ఉత్తరకొరియాపై అమెరికా...అమెరికాపై, ఉత్తరకొరియా కారాలు మిరియాలు నూరుతున్న సంగతి తెలిసిందే. దేశాన్ని నాశనం చేస్తామని అమెరికా భయపెడుతుండగా, వరుస అణ్వాయుధ పరీక్షలతో తమను తక్కువ అంచనా వేయవద్దని అమెరికాతో పాటు ప్రపంచాన్ని కూడా ఉత్తరకొరియా ఆందోళనలోకి నెడుతోంది. ఈ నేపథ్యంలో చైనా అధికారిక పత్రిక జిలిన్ డెయిలీ 'కామన్ సెన్స్' పేరిట ఆసక్తికర కథనం ప్రచురించింది. ఇందులో అణుదాడి జరిగితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలిపింది. అణు దాడి జరిగినప్పుడు ప్రజలు నీళ్లు బాగా వుండే కాలువల్లో వుండాలని సూచించింది. లేదంటే నదులు, సరస్సుల్లో ఎక్కువ సేపు ఉండాలని, తద్వారా మరణాన్ని జయించవచ్చని వెల్లడించింది.

సరస్సులు, నదులు అందుబాటులో లేని పక్షంలో చర్మం బయటకు కనబడకుండా దుస్తులు ధరించాలని సూచించింది. తద్వారా అణుదాడి ద్వారా సంభవించే దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చని ఆ కథనం తెలిపింది. ఈ మేరకు ఒక కార్టూన్ ను కూడా ప్రచురించింది. అంతేకాకుండా గతంలో జపాన్ లోని హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుదాడులు, వాటి ప్రభావం, రక్షణ చర్యలను కూడా ఆ పత్రిక సవివరంగా ప్రచురించింది.

కాగా, జిలిన్ సిటీ ఉత్తరకొరియాకు దగ్గరగా ఉంటుంది. ఆ పట్టణ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆ పత్రిక ఈ కథనం ప్రచురించింది. దీంతో చైనా కథనం వివిధ దేశాల్లో ఆసక్తి రేపుతోంది. ఉత్తరకొరియాకు సుదీర్ఘ కాలంగా మిత్రదేశంగా ఉన్న చైనా అకస్మాత్తుగా ఈ కథనం ఎందుకు ప్రచురించాల్సి వచ్చింది? అని వివిధ దేశాలు ఆలోచనలో పడ్డాయి.  

More Telugu News